Raavi-Venkateswara-Rao-Vangaveeti-Rangaడా.అంబేడ్కర్‌ ఆశయాలను గౌరవిస్తున్నామా లేదా అనేది కాదు ముఖ్యం ఆయనకి భారీ విగ్రహాలు కట్టిస్తున్నామా… జిల్లాలకి, యూనివర్సిటీలకి ఆయన పేర్లు తగిలిస్తున్నామా… జయంతి, వర్ధంతి రోజున హడావుడి చేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. కనుక డా.అంబేడ్కర్‌ కంటే ఆయన పేరుతో జరిగే హడావుడికే ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తుంటుంది.

అదేవిదంగా సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం హత్య చేయబడిన వంగవీటి రంగ పేరుతో కూడా ప్రస్తుతం ఏపీలో జోరుగా కాపు రాజకీయాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకీ ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీల దృష్టి కాపు ఓటు బ్యాంక్‌పైనే ఉంది. గుడివాడలో టిడిపి ఇన్‌ఛార్జ్‌ రావి వేంకటేశ్వర రావు అధ్యర్యంలో టిడిపి కార్యకర్తలు నిన్న వంగవీటి రాధ వర్ధంతి నిర్వహించాలనుకొన్నప్పుడు, ఒకవేళ వైసీపీ నేతలకి కూడా వంగవీటిపై గౌరవం ఉంటే దానికి ఆటంకం కలిగించకూడదు కదా? కానీ కర్రలతో దాడులు చేసి అడ్డుకొన్నారు. టిడిపిని ఎందుకు అడ్డుకొన్నారని ఆలోచిస్తే ఈ కార్యక్రమం పేరుతో కాపులని టిడిపి ఎక్కడ తమవైపు తిప్పుకొంటుందో అనే భయంవల్లనే కావచ్చు.

Also Read – గిల్లుతున్నారా.? అలుగుతున్నారా.?

ఓబీసీ రిజర్వేషన్లకి ఎటువంటి అభ్యంతరమూ లేదని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది కనుక కాపుల ఓట్లు కావాలని వైసీపీ కోరుకొంతున్న వైసీపీ కాపులకి రిజర్వేషన్లు ఇవ్వొచ్చు కదా?అంటూ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సిఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ వ్రాశారు. అందరికీ ఇవ్వగా మిగిలినవాటిలో కాపులకి రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన ఆ లేఖలో కోరారు. దానిపై ప్రభుత్వం ఏవిదంగా స్పందిస్తుందో పక్కనపెడితే, బీసీలకు న్యాయం చేస్తామంటూ ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల పదవీకాలం వారికి ఏమీ చేయకుండానే ముగిసిపోయాయి.

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ మొదట్లో కులం పేరుతో రాజకీయాలు చేయడానికి ఇష్టపడేవారు కారు. బహుశః అందుకే రాష్ట్రంలో బలమైన కాపు సామాజికవర్గం గత ఎన్నికలలో జనసేనకి దూరంగా ఉండిపోయింది. కనుక ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా కులసమీకరణల ప్రకారం ముందుకు సాగుతూ కాపు నేతలతో సమావేశమవుతున్నారు.

Also Read – చిచ్చుబుడ్డి లా లేచి..తుస్సుమన్నారు..!

ఇదే వైసీపీని తీవ్ర ఆందోళనకి గురి చేస్తోంది. కనుకనే సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రి రోజా వరకు అందరూ ఆయనని దత్తపుత్రుడని సంభోదిస్తూ, ఆయనకి కాపులు మద్దతు ఇస్తే ఆయన చంద్రబాబు నాయుడుకి వాటిని తాకట్టు’పెట్టేస్తారని ఆరోపిస్తోంది. అంటే వైసీపీకి కాపు ఓటు బ్యాంక్ గురించే తప్ప వారి సంక్షేమం పట్ల వైసీపీకి ఆసక్తిలేదని అర్దమవుతోంది.

పార్టీలో బొత్స సత్యనారాయణ వంటి కాపు నేతలున్నప్పటికీ, వారికి తమ సామాజికవర్గంలో వంగవీటి రంగకి ఉన్నంత ఆదరణ లేదు. వంగవీటి రంగ పేరుతో కాపులను ఆకట్టుకోవడం ఎంత ముఖ్యమో వారు టిడిపి, జనసేనలవైపు మొగ్గు చూపకుండా అడ్డుకోవడం కూడా అంతే అవసరం. కనుకనే వైసీపీ నేతలు కూడా వంగవీటి పేరుతో రాజకీయాలు చేస్తున్నట్లు భావించవచ్చు. కానీ ఎవరు తమకి మేలు చేశారు? ఎవరు తమని ఓటింగ్ యంత్రాలుగా చూస్తున్నారనే విషయం కాపులకి తెలియదనుకోవడం అవివేకమే కదా?

Also Read – ఉద్వేగమా, ఉన్మాదమా ?!?!?