సుకుమార్ దర్శకత్వంలో మెగా హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాకు “రంగస్థలం” అన్న టైటిల్ తో పాటు, సినిమా విడుదలను కూడా చిత్ర యూనిట్ ధృవీకరించింది. సంక్రాంతి 2018 విడుదలగా చెప్పడంతో మెగా అభిమానులకు స్పష్టత ఇచ్చేసినట్లయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకున్న ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ బ్యాక్ గ్రౌండ్ రీత్యా, ఖచ్చితంగా విడుదలలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. దీంతో సుక్కూ – చెర్రీ సంక్రాంతి బరిలో నిలవడం ఖాయం.
అయితే గతంలో సుకుమార్ దర్శకత్వం వహించిన రెండు సినిమాలు కూడా సంక్రాంతికే విడుదలై… బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అందులో ప్రధానంగా మహేష్ బాబుతో తెరకెక్కించిన “1 నేనొక్కడినే” దారుణ పరాజయం పాలు కాగా, జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన “నాన్నకు ప్రేమతో” సినిమా విమర్శకుల ప్రశంసలు అయితే పొందింది గానీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన కలెక్షన్స్ ను మాత్రం సాధించలేకపోయింది. మరి తాజా సినిమా కూడా అదే సంక్రాంతికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకోవడం విశేషం.
మరి ఇండస్ట్రీలో ఉండే సెంటిమెంట్స్ రీత్యా “రంగస్థలం” సినిమా విడుదలను ఈ సెంటిమెంట్ అడ్డుకుంటుందా? మరో వైపు రామ్ చరణ్ కు కూడా సంక్రాంతి తీపి జ్ఞాపకాలనేమీ మిగల్చలేదు. ‘నాయక్, ఎవడు’ సినిమాలను విడుదల చేయగా, రెండూ కమర్షియల్ గా పర్వాలేదనిపించుకున్నాయి తప్ప, చెర్రీ కెరీర్ లో ఎదగడానికి పెద్దగా ఏమీ ఉపయోగపడలేదు. బహుశా ఈ ఇద్దరి రాతను మార్చే సినిమాగా 2018 సంక్రాంతికి విడుదల కాబోతున్న “రంగస్థలం” నిలుస్తుందేమో చూడాలి.



