పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్లోకి వచ్చిన కొత్త 2000 రూపాయల కట్ల నోట్లు బ్యాంకుల ద్వారా పక్క దారి పట్టిన విషయం తెలిసిందే. ఓ పక్కన సామాన్యుడికి రోజుకు 2 వేల రూపాయలు దక్కడమే గగనమైపోయిన తరుణంలో… మరో పక్కన కోట్లకు కోట్లతో 2 వేల రూపాయల కట్టల నోట్లు బయట పడుతుండడంతో బ్యాంకులలో అక్రమాలు జరిగిందన్న విషయానికి ఆర్బీఐ వచ్చేసింది. అయితే తాజాగా ఆర్బీఐ అధికారే ఈ నోట్ల మార్పిడిలో అరెస్ట్ కావడం వేరే విషయం అనుకోండి..!
బ్యాంకులలో జరిగిన అక్రమాలపై కొరడా జులిపించేందుకు సిద్ధమైన ఆర్బీఐ, నవంబర్ 8వ తేదీ నుండి బ్యాంకులలో నమోదైన సీసీ టీవీ ఫుటేజ్ లను తొలగించవద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 30వ తేదీ వరకు నమోదయ్యే ఫుటేజ్ లను భద్రపరచాలని చెప్పడంతో… బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఆర్బీఐ సిద్ధమైందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధాని మోడీ నిర్ణయనికే మస్కా కొట్టి, కోట్ల రూపాయలను పక్కదారి పట్టించిన అధికారులకు ఈ సీసీ ఫుటేజ్ లను మాయం చేయడం పెద్ద విషయమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రధాని మోడీ, ఆర్బీఐ గవర్నర్లను మించిన తెలివితేటలు నల్లకుభేరుల సొంతమని ఇప్పటికే నిరూపించుకున్నారు. డిసెంబర్ 10వ తేదీకి ఏకంగా 12.50 లక్షల కోట్ల దాకా చేరిందని స్వయంగా ఆర్బీఐనే స్పష్టం చేయడంతో… గడువు తేదీ ముగిసే సమయానికి బ్లాక్ మనీగా భావించిన మొత్తం సొమ్ము కూడా బ్యాంకులలో జమయ్యే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. దీంతో నల్లకుభేరుల మెడలు వంచాలన్న నిర్ణయాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకున్న వారు, ఆర్బీఐ చర్యలకు బొక్కలు వెతక్కుండా ఉంటారా? తమకు సహకరించిన బ్యాంకు అధికారులకు సలహాలు ఇవ్వకుండా ఉంటారా?!



