ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాల స్తబ్దుగా ఉన్న మాట వాస్తవం. గత టీడీపీ హయంలో ఏపీలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్ణయంతో ఆయా చుట్టూ పక్కల ప్రాంతాలలో భూముల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి.
సన్ రైజ్ స్టేట్ గా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడానికి కావాల్సిన అన్ని అస్రాలను సిద్ధం చేసుకున్నారు. ఇటు రాజధాని నిర్మాణం, అటు పోలవరం పూర్తి, అలాగే పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనపరిచే వ్యాపారవేత్తలకు పెద్ద ఎత్తున రాయితీలు అంటూ ప్రకటించి, ఇలా ఎటు చూసిన ఏపీ పట్ల ఒక పాజిటివ్ సైన్ ను కనిపరిచారు.
2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో హైద్రాబాద్ ను తళతన్నెంతలా అమరావతి చుట్టూ పక్కల ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగింది. ఇక 2019 ఎన్నికలలో వైసీపీ విజయంతో రాష్ట్ర రాజధాని అమరావతే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యాపారాలు కూడా చిన్నాభిన్నమయిపోయాయి.
జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీలో పెట్టుబడులు అనే పదం కూడా వినిపించనంత దూరంగా ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్ల పాలన గడిచింది అంటే అది అతిశయోక్తి కాకపోవచ్చు. అలాగే ఏపీ పునర్నిర్మాణంలో భాగంగా పెరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా వైసీపీ దెబ్బకు పాతాళానికి పడింది.
2024 ఎన్నికలలో తిరిగి టీడీపీ కూటమి విజయం సాధించడంతో ఏపీ రాజధాని మీద ఒక స్పష్టత వచ్చి మళ్ళీ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. అయితే ఆ వచ్చిన ఊపు ఎంతోకాలం నిలబడలేకపోవడం కూడా అంతే వాస్తవమని ఒప్పుకుని తీరాలి. కేంద్రలో ఉన్న బీజేపీ కూడా ఏపీ పునర్నిర్మాణం పట్ల దూకుడుగా నిర్ణయాలు తీసుకోకపోవడం ఇందుకు ఒక కారణం కావచ్చు.
దానికి తోడు తాజాగా రాష్ట్రంలో వచ్చిన వరదల బీభత్సం ఒక కారణం కావచ్చు, అలాగే తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే మన పెట్టుబడులకు భద్రతా ఉంటుందా అన్న ప్రజల ఆలోచన కావచ్చు, లేక టీడీపీ కూటమి ప్రభుత్వం పై ప్రజలు పెట్టుకున్న అంచనాలు ఆ స్థాయిని అందుకోకపోవడం కావచ్చు.
కారణం ఏదైనా కానీ ఏపీలో ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాదిరి ఎటువంటి హడావుడి లేకుండా స్తబ్దుగానే కొనసాగుతుంది. అయితే ఏపీలో పరిస్థితులు ఇలా నమ్మకానికి, అనుమానానికి మధ్య నలిగిపోతుంటే అటు తెలంగాణలో రియల్ ఎస్టేట్ హైడ్రా కు కూల్చివేతల మధ్య చిదిరమవుతుంది.
హైద్రాబాద్ లో ఆక్రమణల తొలగింపు, అక్రమ కట్టడాల కూల్చివేత అంటూ హైడ్రాతో రేవంత్ సర్కార్ అటు సాధారణ ప్రజలనే కాదు ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా భయాందోళనలోకి నెట్టింది. దీనితో ఏవీ ఆక్రమణలో, ఏవి అక్రమ నిర్మాణాలో తెలియక అటు ప్రజలు ఇటు వ్యాపారాలు పెట్టుబడులు పెట్టేందుకు అడుగు ముందుకు వేయడం లేదు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో ముఖ్యంగా హైద్రాబాద్ వంటి మహా నగరాలలో సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతంత మాత్రంగానే కొనసాగుతుంది. అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక బలమైన అభివృద్ధి నినాదముతో ప్రజలలో నమ్మకం కలిగించగలిగితే మళ్ళీ రెండు రాష్ట్రాలలో రియల్ భూమ్ కనిపించగలుగుతుంది.




