రేవంత్ రెడ్డికి అన్నీ అపశకునాలే…

Revanth Reddy political challenges in Telangana

తెలంగాణలో కేసీఆర్‌ని కొట్టిన మొనగాడిగా, కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి అధికారంలోకి తెచ్చిన బాహుబలిగా సిఎం రేవంత్ రెడ్డి మంచి పేరే సంపాదించుకున్నారు.

రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు నేటికీ కేసీఆర్‌ కోలుకోలేకపోతున్నారు. రెండున్నరేళ్ళుగా ఫామ్‌హౌసు గడప దాటకపోవడమే ఇందుకు నిదర్శనం.

ADVERTISEMENT

అయితే బీఆర్ఎస్‌ పార్టీ ఎన్నటికీ కోలుకోలేదనుకుంటే, అది కూడా ఈ రెండున్నరేళ్ళలోనే పూర్తిగా కోలుకొని, నిత్యం రేవంత్ రెడ్డికి సవాళ్ళు విసురుతూనే ఉంది.

ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంపై నిలదీస్తూనే ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంది. తాజాగా రేవంత్ రెడ్డి సోదరుల భూభాగోతాల గురించి ప్రశ్నించడం మొదలుపెట్టింది.

అంతే కాదు.. కాంగ్రెస్‌ పార్టీలో బలహీనమైన లింక్‌లా దొరికిన మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితకు ఈ ఆయుధాలు అందిస్తూ రేవంత్ రెడ్డిపై ప్రయోగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆమె వెనుక బీఆర్ఎస్‌ పార్టీ ఉందో లేదో తెలీదు కానీ ఆమె కూడా రేవంత్ రెడ్డి సోదరుల భూదందాల గురించి ప్రశ్నిస్తున్నారు. రేవంత్ కుటుంబం భూబాగోతాలన్నీ త్వరలో బయటపెడతానని హెచ్చరిస్తున్నారు.

కేసీఆర్‌ అంతటివాడినే ఎదుర్కొన్న సిఎం రేవంత్ రెడ్డికి కనీసం ఎమ్మెల్యే కూడా కాని సొంత పార్టీలో కొండా సుస్మితని ఎదుర్కోవడం పెద్ద సమస్య కానే కాదు. కనుక త్వరలోనే ఆమె సైలంట్ అయిపోవచ్చు. లేదా బీఆర్ఎస్‌ పార్టీలో చేరిపోవచ్చు.

కానీ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద షాక్ ఇచ్చింది. ఆయన లండన్ నుంచి అమెరికా వెళ్ళాలనుకుని, ముందస్తు ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. కానీ అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించి షాక్ ఇచ్చింది. దీంతో ఆయన అర్దాతరంగా పర్యటన ముగించుకొని ఎల్లుండి హైదరాబాద్‌ తిరిగి రాబోతున్నారు.

అలాగని సిఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ప్రధాని మోడీ ఎప్పుడు హైదరాబాద్‌ వచ్చినా ‘పెద్దన్న.. పెద్దన్నా..’ అంటూ వెంట తిరుగుతూ ‘మీ ఆశీర్వాదం అవసరమని’ బహిరంగంగానే చెప్తారు. కానీ కాంగ్రెస్‌ కాంగ్రెస్సే… బిజేపి బిజేపియే అని కేంద్రం భావిస్తున్నట్లు ఈ షాక్‌తో స్పష్టం చేసింది.

మరో 5-10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటుంటే, ఢిల్లీ నుంచి ‘సీల్డ్ కవర్ సిఎం’ వస్తారంటూ కొండా సుస్మిత, బిజేపి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణయే’ అని ప్రధాని మోడీ చెప్తున్నారు. ఇప్పుడు ఈవిధంగా చిన్న షాక్ ఇచ్చారు.

ఓ పక్క రేవంత్ కుటుంబం, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా మళ్ళీ మెల్లగా అసమ్మతి పెరుగుతోంది. కనుక రేవంత్ రెడ్డి మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఏదో అనర్ధం జరిగే ప్రమాదం ఉందనిపిస్తుంది.

చివరిగా ఒక్క మాట! “కాంగ్రెస్‌ పార్టీని ఎవరూ ఓడించలేరు. దానిని అదే ఓడించుకున్నప్పుడే ఇతర పార్టీలు గెలుస్తుంటాయి,”అనే మాట వినే ఉంటారు. ఈ అనూహ్య పరిణామాలను గమనిస్తే అదే జరుగబోతోందా? అనే సందేహం కలుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories