అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు పూర్తవుతున్నా పాలన లో తన మార్క్ చూపించలేకపోతున్నారు అన్న ఆరోపణలు ఎదుర్కున్న రేవంత్ ఒక్కసారిగా హైడ్రా తో అందరి దృష్టిని తన వైపు మరల్చుకున్నారు. ఒకే ఒక్క కూల్చివేతతో అటు మెయిన్ స్టీమ్ మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ రేవంత్ రెడ్డి పేరు మారుమోగింది.

ఎన్ కన్వెన్షన్ పేరుతో చెరువును ఆక్రమించి అక్కినేని నాగార్జున నిర్మాణాన్ని చేపట్టారు అనే మంత్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా N కన్వెన్షన్ నిర్మాణాన్ని నేలమట్టం చేసేసింది. ఒక సెలబ్రెటీ నిర్మాణం కూల్చివేతతో రెండు తెలుగు రాష్ట్రాలలో హైడ్రాతో పాటుగా రేవంత్ రెడ్డి కూడా హాట్ టాపిక్ గా నిలిచారు.

Also Read – మేలు చేస్తే ఎన్నికల వరకే అభివృద్ధి చేస్తే…

బీజేపీ, వామపక్షాలు రేవంత్ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైడ్రా చర్యలకు మద్దతు పలుకుతు నాగార్జున తో పాటుగా ఈ నిర్మాణాల కట్టడాలకు అనుమతించిన అధికారుల పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష పాత్రలో ఉన్న బిఆర్ఎస్ మాత్రం రైతు రుణమాఫీ పై కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వచ్చిన ప్రజా వ్యతిరేకతను పక్క దారి పట్టించాడనికే రేవంత్ ఈ ‘హైడ్రా’మా ను తెర మీద రక్తికట్టిస్తున్నారు అంటూ కూల్చివేతలను ఖండిస్తున్నారు.

ప్రకృతి సంపదను విధ్వంసం చేసి నిర్మాణాలు చేపడితే అది విలయం గా మారి దాని ప్రకోపాన్ని చూపించి తీరుతుంది. ఈ అక్రమ నిర్మాణాల ప్రకోపం తాలూకా ఫలితాలు చెన్నె వరదల సమయంలోను, నిన్న మొన్న జరిగిన వయనాడ్ కల్లోలంలోను కళ్లారా చూసాం. ఆ పరిస్థితులు తెలంగాణ లో, ముఖ్యంగా హైద్రాబాద్ వంటి మహా నగరంలో రాకుండ ఉండాలి అంటే ఈ కూల్చివేతలు తప్పనిసరి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.

Also Read – వైసీపీకి గమనిక: డీఎస్సీ అంటే ఉద్యోగాల భర్తీకి!

కూల్చివేతలకు రాజకీయాలకు సంబంధం లేదని, ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ఏ స్థాయి వ్యక్తులైనా, ప్రభుత్వం పై ఎంత ఒత్తిడి తెచ్చినా, చివరికి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నా వీటి పై ఉక్కుపాదం మోపడం ఖాయమంటూ తన చర్యలను సమర్ధించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్. భవిష్యత్ తరాలకు ప్రకృతి తాలూకా ఆస్తిని అందించాలంటే ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసొకొకతప్పదు అని తేల్చేసారు.

అయితే హైద్రాబాద్ లో ఈ హైడ్రా సృష్టించిన ప్రకంపనలు ఇప్పటితో ఆగవనేది ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలతో స్పష్టమయిపోయింది. దీనితో నెక్స్ట్ హైడ్రా బాధితుల లిస్ట్ ఇదే అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లు మల్లా రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. హైద్రాబాద్ సిబారు ప్రాంతంలో చెరువులను కబ్జా చేసి మల్లా రెడ్డి కాలేజీని నిర్మించారంటూ హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్టు సమాచారం.

Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.

అలాగే పల్లా రాజేశ్వరెడ్డి కి చెందిన అనురాగ్ కాలేజీ కూడా అధికారులను మేనేజ్ చేసి కట్టిన ఒక అక్రమ కట్టడమే అనేది బయటకొచ్చింది. దీనితో ఇన్నాళ్ళుగా అధికారుల అండదండలతో యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టిన ఒక్కో బడా బాబులకు వెన్నులో వణుకు మొదలయ్యింది. మొత్తానికి రేవంత్ అక్రమ నిర్మాణాల కూల్చివేతల హైడ్రాతో తన రాజకీయ ఆట మొదలుపెట్టారు.




ఇన్నాళ్ళుగా సైలెంట్ గా ఉంటూ ఇంకా తన మార్క్ పాలన చూపించలేదు అనుకున్న వారికీ ఒక్కసారిగా హైడ్రాతో ఊహించని షాక్ ఇచ్చారనే చెప్పాలి. పదేళ్ల క్రితం తానూ టీడీపీ ఎమ్మెల్యే గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ కన్వెన్షన్ మీద ఏదైతే ఆరోపణలు చేసారో దానికి కట్టుబడి, వాటి పై అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే చర్యలు తీసోకమని సలహాలిచ్చారో వాటికి అనుగుణంగానే ఇప్పుడు రేవంత్ ఆచరించి చూపించారే తప్ప ఇదేమి వ్యక్తిగత వివాదం కాదు లేక రాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగమో కాదని హైద్రాబాద్ వాసులు కూడా రేవంత్ నిర్ణయాన్ని సమర్థిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు.