బీఆర్ఎస్ పార్టీ ‘తెలంగాణ సెంటిమెంట్’తో రాజకీయాలు చేస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చోలేదు సిఎం రేవంత్ రెడ్డి. దానికి విరుడుగుగా బీఆర్ఎస్ పార్టీ దాని అధినేత కేసీఆర్ మీద అనేక అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూనే ఉన్నారు.
కేసీఆర్ ఏ కాళేశ్వరం ప్రాజెక్టుతో మంచి పేరు సంపాదించుకున్నారో దాంతోనే సీబీఐ కేసు అయన మెడలో వేయాలనుకున్నారు. కాళేశ్వరం కేసుపై సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ కేంద్ర హోంశాఖకి లేఖ వ్రాసి రెండు వారాలవుతున్నా ఉలుకు పలుకూ లేదు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్‌తో కుమ్మక్కయ్యి, సీబీఐ విచారణ మొదలుపెట్టకుండా అడ్డుకుంటున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రధానాస్త్రం ‘తెలంగాణ సెంటిమెంట్’కి విరుగుడుగా ‘బీసీ రిజర్వేషన్స్’ అస్త్రాన్ని రేవంత్ రెడ్డి ప్రయోగించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ జనాభా ఎక్కువే కనుక ఇది తప్పకుండా క్లిక్ అవుతుందని సిఎం రేవంత్ రెడ్డి గట్టిగా నమ్మారు.
కానీ దీనికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్స్ కోసం తాము శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చట్టాలు చేసి గవర్నర్ ఆమోదానికి పంపిస్తే ఆయన వాటిని రాష్ట్రపతికి పంపించేశారని, అక్కడ ఢిల్లీలో కిషన్ రెడ్డి వాటిని అడ్డుకుంటున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ సమాధి కట్టడానికి సిఎం రేవంత్ రెడ్డి ప్రయోగించిన ఈ రెండు దివ్యాస్త్రాలు ఇలా నిర్వీర్యం అవుతాయని బహుశః ఆయన కూడా ఊహించి ఉండరేమో?





