టెక్నాలజీ వాడకంలో బాబు తర్వాతే…

Robotic Life Boat Andhra Pradesh Floods

చంద్రబాబు నాయుడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఐ‌టి రంగానికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని గుర్తించి బలమైన పునాది వేశారు. దాని ఫలితాలను సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు మాత్రమే కాదు ఇప్పుడు సమాజంలో ప్రతీ ఒక్కరూ ఏదో రూపంలో ఉపయోగించుకుంటూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను ఉపయోగించుకోవడంలో సిఎం చంద్రబాబు నాయుడు తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. నేటికీ మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు ఎలా వాడాలో తెలీని ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు దేశంలో కోకొల్లలున్నారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు ‘ఏఐ’ (ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్) టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు.

ఆయన ఈ వయసులో కూడా సాంకేతిక రంగం గురించి ఇంత అవగాహన, ఆసక్తి కలిగి ఉండటం, ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను ఉపయోగించుకోవాలనుకోవడం చాలా గొప్ప విషయమే.

ADVERTISEMENT

దేశంలో ఎల్ఈడీ లైట్లు కొత్తగా ప్రవేశించిన వెంటనే మొట్టమొదట వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే.

అమరావతిలో ‘ఏఐ’ టెక్నాలజీని ఉపయోగించుకుంటామని, ‘ఏఐ’ కోర్సులతో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పడం ఇందుకు మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

తాజాగా విజయవాడ వరదలలో డ్రోన్ కెమెరాలతో వరద పరిస్థితిని అంచనా వేస్తూ చర్యలు చేపట్టడం, ముంపు ప్రాంతాలలో చిక్కుకున్న బాధితులకు డ్రోన్ల ద్వారానే నీళ్ళు, ఆహారం సరఫరా చేయడం అందరూ చూశారు. అయితే ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాలు డ్రోన్ సేవలను ఈవిదంగా కూడావాడుకుంటున్నాయి. కనుక ఇది గొప్ప విషయం కాకపోవచ్చు.

తాజాగా నదులు లేదా వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నవారిని కాపాడేందుకు కొత్తగా డ్రోన్ టెక్నాలజీతో పనిచేసే ఓ ‘రెస్క్యూ బోట్’ అందుబాటులోకి వచ్చింది. దానిని సిఎం చంద్రబాబు నాయుడు వెంటనే ప్రయోగాత్మకంగా పరీక్షింపజేసి చూశారు. అది చాలా చక్కగా పని చేస్తుండటంతో అటువంటి యంత్రాలను మరిన్ని రప్పించబోతున్నారు.

డ్రోన్‌లాగే దీనిని జాయ్ స్టిక్‌తో నియంత్రించవచ్చు. ఈ మినీ రెస్క్యూ బోట్‌ నీళ్ళలో మునిగిపోతున్న వ్యక్తి వద్దకు పంపించి, దానితోనే సురక్షితంగా ఒడ్డుకి రప్పించవచ్చు.

గజ ఈతగాళ్ళని రప్పించి వారు నీళ్ళలో మునిగిపోతున్న వ్యక్తి వద్దకు ఈదుకుంటూ వెళ్ళి కాపాడటానికి చాలా సమయం పడుతుంది. అదే ఈ ‘డ్రోన్ రెస్క్యూ బోట్లు’ అందుబాటులోఉంచితే నీళ్ళలో మునిగిపోతున్న వ్యక్తులను ఎవరైనా కాపాడగలుగుతారు కదా?

కనుక కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే సరిపోదు దాని గురించి తెలుసుకొని వాడుకోవాలనే ఆసక్తి కూడా చాలా ముఖ్యం. అది సిఎం చంద్రబాబు నాయుడులో పుష్కలంగా ఉంది.

ADVERTISEMENT
Latest Stories