బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోకి పవన్ కళ్యాణ్ వెళ్ళడం పెద్ద నేరం అన్నట్లు మంత్రి రోజా మాట్లాడారు. ఏనాడూ ఇటువంటి టాక్ షోలకి వెళ్ళని పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీనికి ఎందుకు వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు సూచన మేరకే అని మంత్రి రోజా కనిపెట్టి చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్యాకేజీలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ అన్‌స్టాపబుల్ టాక్ షోకి వెళ్ళారని మంత్రి రోజా నిర్ధారించారు.
అంటే పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమానికి వెళ్ళాలో, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలో అన్నీ వైసీపీ చెప్పిన్నట్లు నడుచుకోవాలన్న మాట! కాదని తన సొంతంగా ఆలోచిస్తే ఈ విదంగా ప్యాకేజీ స్టార్ అంటూ ముద్రవేసేస్తారన్న మాట!
తెల్లవారిలేస్తే ఈటీవీ, ఆంధ్రజ్యోతి మీడియాని తిట్టిపోసే మంత్రి రోజా అదే ఈ టీవీ నిర్వహించిన జబర్దస్త్ రియాల్టీ షోలో చాలా కాలమే పనిచేసి దానికి ప్యాకేజీ తీసుకొన్నారు కదా? తమ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించే ఈనాడు మీడియా నిర్వహించే జబర్దస్త్ షోలో పాల్గొని డబ్బు తీసుకొనేందుకు మొహమాట పడని మంత్రి రోజా, పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క షోకి వెళితే అభ్యంతరం ఎందుకు చెపుతున్నారు? ఒకవేళ బాలకృష్ణ రేపు ఆమెని అన్‌స్టాపబుల్ షోకి ఆహ్వానిస్తే ఆమె పరిగెట్టుకొని వెళ్ళకుండా ఉంటారా?
ఈసారి ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కాపుల ఓట్లు ఎక్కడ తన్నుకుపోతాడో అని వైసీపీ తీవ్ర ఆదోళన చెందుతోంది. బహుశః అందుకే పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి మాట్లాడుతూ, కాపులను వారికి దూరం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు భావించవచ్చు. తద్వారా కాపులను వైసీపీవైపు ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నట్లు అర్దం అవుతోంది. అయితే వైసీపీ నేతల నోటి దురుసుతనంతోనే కాపులు వైసీపీకి దూరమయ్యి టిడిపి, జనసేనల పట్ల ఆకర్షితులవుతారని గ్రహిస్తే వారికే మంచిది.



