ఓ పక్కన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి… మరో పక్కన టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి… వీరిద్దరి మధ్య జరిగిన ఓ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల ఓ ఫ్లైట్ లో వీరిద్దరూ ప్రయాణించిన సందర్భంలో ముచ్చటించుకున్న విశేషాలు ఇవి. ఇందులో జగన్ ‘కులాలను’ దృష్టిలో పెట్టుకుని మాటలు కలపగా, రేవంత్ రెడ్డి పార్టీలను మనసులో పెట్టుకుని భావాలను వేరు చేసారు. ఇంతకీ వారిద్దరూ ఏమనుకున్నారంటే…
“ఇద్దరం రెడ్లకు అధికారం దక్కడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నాము సోదరా” అంటూ జగన్ పలకరించగా… రేవంత్ నవ్వుతూ… “సోదరా కులం మీద అభిమానం ఉన్నా, అన్ని కులాలకు ఒకే వేదిక తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. బిజెపిలో పొత్తు అని చంద్రబాబు 2014లోనే చెప్పారు, అదే మాట మీద ఉన్నారు. మరి నువ్వు సోదరా…!!”
“అవసరం కోసం, అధికారం కోసం మాట మార్చి నిన్ను నమ్ముకున్న మైనార్టీలను తికమకపెడుతున్నావు” అని రేవంత్ అనగా… ‘అసలు నీ ధైర్యం ఏంటి’ అంటూ జగన్ గంభీరంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రేవంత్ తన భుజం మీద ఉన్న పసుపు కండువా చూపిస్తూ… ఇదే నా ధైర్యం… అన్నారు. ఇది క్లుప్తంగా జగన్ – రేవంత్ రెడ్డిల మధ్య జరిగిన సంభాషణగా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.
అయితే ఇదంతా నిజమే అనుకునేరు..! ఇది నిజమో, కాదో తెలియదు గానీ వీరిద్దరికీ సంబంధించి మాత్రం ఈ వార్త ప్రచారం జరుగుతోంది. రాజకీయాలలో జగన్, రేవంత్ రెడ్డిలు క్రేజ్ ఉన్న నాయకులు కావడంతో, ఎవరైనా ఇలాంటి కధనాలను పుట్టించే అవకాశము లేకపోలేదు. అలాగని జరగడానికి ఆస్కారము లేకపోలేదు. ఎందుకంటే… ఈ ఇద్దరూ నేతలు ప్రతిపక్షంలో ఉండి బిజీబిజీగా రాజకీయాలు సాగిస్తున్నారు.



