‘పాత’ నోట్లకు ‘కొత్త’ ఫ్యాన్సీ ఆఫర్లు!

500 Notes Exchange Offerపెద్ద‌ నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప్ర‌జ‌లంద‌రూ త‌మ వ‌ద్ద ఉన్న పాత నోట్ల‌ను మార్చుకునేందుకు బ్యాంకుల ముందు బారులు తీరారు. దీన్ని ఆసారాగా తీసుకుని క‌మీష‌న్ల‌పై పాత నోట్ల‌ను మార్చి కొంద‌రు సొమ్ము చేసుకున్నారు. దేశ‌వ్యాప్తంగా ఈ దందా చాలా జోరుగా సాగింది. కోల్‌ క‌తాలోని బుర్రా బ‌జార్‌ లోనూ ఈ వ్యాపారం మాంచి ఊపుమీద న‌డిచింది. అయితే ఇప్పుడు అదే మార్కెట్లో సీన్ రివ‌ర్స్ అయింది. నెల‌ రోజుల క్రితం పాత వెయ్యి నోటుకు 800, పాత 500 నోటుకు 300 ఇచ్చి నోట్లు మార్పిడి చేసుకున్న చోట, పరిస్థితి పూర్తిగా త‌ల్ల‌కిందులైంది.

ADVERTISEMENT

ఇప్పుడు పాత 1000 నోటుకు 1100, 500 నోటుకు 550 ఇచ్చి మరీ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. నెల‌ రోజుల్లోనే ప‌రిస్థితి ఇలా మార‌డానికి చాలా కారణాలున్నాయి. షెల్ కంపెనీలు త‌మ బ్యాలెన్స్ షీట్ల‌లో ‘క్యాష్ ఇన్ హ్యాండ్‌’ను పెద్ద ఎత్తున చూపించుకునేందుకు ఈ బాట‌ను ఎంచుకున్నాయి. డిసెంబ‌రు 31న ముగిసే మూడో త్రైమాసికం లోపు తాము పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వ‌హించిన‌ట్టు పేప‌ర్ల‌లో చూపించ‌డం ద్వారా త‌మ వ‌ద్ద ఉన్న న‌ల్ల‌డ‌బ్బును తెల్ల‌గా మార్చుకునే వ్యూహంలో భాగంగానే ఇలా పాత నోట్ల‌కు డ‌బ్బులు ఎదురిచ్చి కొనుగోలు చేస్తున్నారు.

‘క్యాష్ ఇన్ హ్యాండ్’ అనేది బ్యాంకులో చూపించ‌ని సొమ్ము. నోట్లు, నాణేల‌ రూపంలో ఉండే ఈ సొమ్మును చిన్న మొత్తాల చెల్లింపుల కోసం ఉప‌యోగిస్తారు. అయితే త‌మ వ‌ద్ద ఉన్న న‌ల్ల డ‌బ్బును అధికారికంగా బ్యాంకు ఖాతాలో వేసుకుని తెల్ల‌ధ‌నంగా మార్చుకునేందుకు ఈ క్యాష్ ఇన్ హ్యాండ్ లావాదేవీలు పెద్ద‌ మొత్తంలో జ‌రిగిన‌ట్టు చూపించడ‌మే ల‌క్ష్యంగా ఇలా పాత నోట్ల‌కు ఎదురు క‌మీష‌న్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు బుర్రాబ‌జార్‌లో ఎటుచూసినా కొత్త నోట్లు ప‌ట్టుకుని పాత నోట్ల మార్పిడి చేస్తున్న‌వారే క‌నిపిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories