శశికళ ప్రమాణ స్వీకారానికి ‘ముహూర్తం’

sasikala-natarajan-oath taking as chief ministerఅన్నాడీఎంకే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన శ‌శిక‌ళ, త‌మిళ‌నాడు ప్ర‌జ‌లకు ప‌విత్ర దిన‌మైన పొంగ‌ల్ పండుగ నాడు ముఖ్య‌మంత్రి ప‌దవిని అధిష్ఠించ‌నున్న‌ట్టు లభిస్తున్న తాజా స‌మాచారం. ఈ నెల 12న ముఖ్యమంత్రి ప‌గ్గాలను ఆమె చేతిలో పెట్టాల‌ని పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత పార్టీ ప‌గ్గాల‌తో పాటు ముఖ్య‌మంత్రి ప‌దవిని కూడా శ‌శిక‌ళ‌కే అప్ప‌గించాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. అనుకున్న‌ట్టే పార్టీ ప‌గ్గాల‌ను అగ్ర‌నాయ‌క‌త్వం ఆమె చేతిలో పెట్టింది. ఇప్పుడు మిగిలింది ఇక సీఎం పీఠ‌మే. దానిని కూడా ఆమెకే అప్ప‌గించాల‌ని సీనియ‌ర్ నేత‌లు వేగంగా పావులు క‌దుపుతున్నారు.

ADVERTISEMENT

జ‌య మృతి త‌ర్వాత పన్నీర్ సెల్వం ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేపట్టినా, పాల‌న మాత్రం చిన్న‌మ్మ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంది. దీనికి తోడు శ‌శిక‌ళ సీఎం ప‌గ్గాలు చేప‌ట్టాల‌నే డిమాండ్ కూడా పార్టీలో ఊపందుకుంది. లోక్‌ స‌భ డిప్యూటీ స్పీక‌ర్ తంబిదురై అయితే శ‌శిక‌ళకు ముఖ్య‌మంత్రి పీఠం అప్ప‌గించ‌డమే ధ్యేయంగా ప‌నిచేస్తున్నారు. ఆయనకు మంత్రులు ఆర్పీ ఉద‌య్‌కుమార్‌, సేవూరు రామచంద్ర‌న్‌, క‌డంబూరు రాజాలు తోడ‌య్యారు. శ‌శిక‌ళ‌ను క‌లిసి సీఎం ప‌గ్గాలు స్వీక‌రించాల్సిందేన‌ని ఒత్తిడి పెంచుతున్నారు.

సోమ‌వారం ముఖ్య‌మంత్రి పన్నీర్ సెల్వం సహా మంత్రులు, నేత‌లు పోయెస్‌ గార్డెన్‌లో చిన్న‌మ్మ‌తో స‌మావేశ‌మై సీఎం ప‌ద‌విపై మ‌రోమారు ఒత్తిడి తీసుకొచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ నెల‌లో జ‌ర‌గ‌నున్న పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎంజీ రామ‌చంద్ర‌న్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల నాటికి శ‌శిక‌ళ‌ను సీఎంను చేయ‌డ‌మే ధ్యేయంగా నేత‌లు ప‌నిచేస్తున్నారు. జిల్లాల వారీగా స‌మావేశాలు నిర్వ‌హించిన త‌ర్వాత రాష్ట్ర‌ స్థాయిలో భారీ స‌మావేశం ఏర్పాటు చేసి సీఎంగా శ‌శిక‌ళ‌ను ఎన్నుకునేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇందుకు ఈ నెల 12నే ముహూర్తంగా నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

ఈ సమాచారం ఇలా హ‌ల్చ‌ల్ చేస్తున్న నేప‌థ్యంలో నేడు రాష్ట్ర క్యాబినెట్ అత్య‌వ‌స‌రంగా సమావేశం కానుంది. ముఖ్య‌మంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలోని మంత్రివ‌ర్గ స‌భ్యులు భేటీ కానున్నారు. కేబినెట్ స‌మావేశంలో సీఎంపై మార్పుపై వ‌స్తున్న వ‌దంతుల‌పైనే ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మరోపక్క పార్టీ చీఫ్ శ‌శిక‌ళ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జిల్లా అధ్య‌క్షుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున్నారు. అలాగే ప్ర‌తిప‌క్ష డీఎంకే కూడా నేడు స‌ర్వ‌స‌భ్య స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. ఒకే రోజు అధికార‌, ప్ర‌తిప‌క్షాలు కీల‌క స‌మావేశాలు నిర్వ‌హించ‌డంతో తమిళనాడు రాజ‌కీయాల్లో మ‌రోమారు వేడి రాజుకుంది.

ADVERTISEMENT
Latest Stories