ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ అన్ని విషయాలలో ఓ అడుగు ముందే ఉంటారు. దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ ఆయన ఏం చేసినా వ్యతిరేకించడమే ప్రజాసమస్యలపై పోరాడటం అని వైసీపీ భావిస్తుంటుంది. కనుక కోడిగుడ్డుకి ఈకలు పీకే ప్రయత్నం చేస్తుంటుంది.
జగన్‌కి పర్యాటక రంగం పట్ల కనీస అవగాహన లేని కారణంగానే విశాఖలో సముద్ర తీరం పక్కనే ఉన్న అందమైన రుషికొండని, దానిపై బీచ్-ఫేసింగ్ టూరిజం శాఖ హోటల్స్ ధ్వంసం చేసి, తన కోసం రూ.500 కోట్ల ప్రజాధనంతో విలాసవంతమైన ప్యాలస్‌లు కట్టించుకున్నారు.
విశాఖలో ప్రసిద్ద పర్యాటక ప్రదేశంగా ఉన్న ఆర్‌కే బీచ్ తీరం తరచూ కోతకు గురవుతూ ప్రమాదకరంగా మారినా పట్టించుకొని జగన్ ప్రభుత్వం, రూ.5-10 కోట్లు ఖర్చుపెట్టి ఉవ్వెత్తున ఎగసిపడే అలలు మీద ‘ఫ్లోటింగ్ బ్రిడ్జ్’ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించి నవ్వులపాలైంది.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రంలో నదీతీరాలు, సముద్ర తీరాలు, రిజర్వాయర్లను ఉపయోగించుకొని సీ-ప్లేన్ సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించారు.
గత ఏడాది నవంబర్‌లో సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా విజయవాడలో కృష్ణానది తీరం నుంచి శ్రీశైలానికి సీప్లేన్‌లో వెళ్ళివచ్చి సాధ్యాసాధ్యాలను సమీక్షించారు. ఆ ట్రయల్ రన్ సంతృప్తికరంగా ఉండటంతో దానికి సన్నాహాలు చేయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడీసీ) రాష్ట్రంలో విజయవాడలో ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జునసాగర్, విశాఖ సముద్రతీరంలో ‘సీ ప్లేన్ పోర్టులు’ ఏర్పాటు చేయవచ్చని తెలియజేసింది. కానీ సిఎం చంద్రబాబు నాయుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే రకం కాదు.
కనుక ఏపీఏడీసీ సూచించిన ఈ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో ఇంకా ఎక్కడెక్కడ సీ ప్లేన్ పోర్టులు ఏర్పాటుకి అవకాశం ఉంది?వాటి నిర్వహణ, ఆదాయం,, ఖర్చులు, లాభనష్టాలు ఏమేరకు ఉంటాయి?ఏయే శాఖల నుంచి అనుమతులు తీసుకోవలసి ఉంటుంది?
వీటి నిర్వహణలో సానుకూలతలు ఏమిటి? ప్రతికూలాంశాలు ఏమిటి? ఎటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది?ఒక్కో ‘సీ ప్లేన్ పోర్టు’ ఏర్పాటుకి ఎంత ఖర్చవుతుంది?ఇవి పర్యాటకులను ఆకర్షించగలుగుతాయా లేదా? తదితర అన్ని అంశాలపై అధ్యయనం చేయడంలో అనుభవం కలిగి, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ఈ మేరకు ఏపీఏడీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 3లోగా దరఖాస్తులు సమర్పించాలని గడువు విధించింది. ఒకవేళ సిఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలు, ప్రయత్నాలు ఫలించి రాష్ట్రంలో సీ ప్లేన్ సర్వీసులు అందుబాటులోకి వస్తే పర్యాటక రంగంలో అవి మరో ప్రత్యేక ఆకర్షణగా మారుతాయి.




