ఐపీఎల్ మానియా ముగిసి కనీసం వారం రోజులు కూడా అవ్వలేదు, ఇంతలోనే టీం ఇండియా అభిమానులకు ఊహించని షాక్లు తగిలాయి. ఐపీఎల్ కు ముందు సొంత గడ్డపై జరిగిన టి-20 వరల్డ్ కప్ లో భారత్ వరుసగా 2వ సారి ప్రపంచ ఛాంపియన్స్ గా నిలిచారు.
కానీ, ఎవ్వరు ఊహించని విధంగా వచ్చే టి-20 సిరీస్ లో వరల్డ్ కప్ విన్నింగ్ టీం కెప్టెన్ ‘సూర్యకుమార్ యాదవ్’ కు కనీసం స్క్వాడ్ లో కూడా చోటు దక్కలేదు. గత నెల రోజుల నుండి టి-20 జట్టు కెప్టెన్సీ విషయంలో భారత సెలెక్టర్లు శ్రేయాస్ అయ్యర్ వైపే మొగ్గు చూపుతున్నారనే వార్త హడావిడి చేసినప్పటికీ, ఈ నిర్ణయాన్ని ఇంత త్వరగా వెల్లడిస్తారని ఎవరు ఊహించలేదు.
ఇటీవలే, భారత సెలెక్షన్ కమిటీ ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ పై టి-20 సిరీస్ కోసమై తుది స్క్వాడ్ ను అఫీషియల్ గా ప్రకటించారు. ఇందులో క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న 15 ఏళ్ళ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలి అంతర్జాతీయ కాల్ తో పాటు గత నెల రోజుల నుండి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్త కూడా నిజమైంది.
సర్పంచ్ సాబ్ అని ఫాన్స్ పిలుచుకునే శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2024 అండ్ 2025 లో రెండు వేరు వేరు జట్లకు సారధి గా వహిస్తూ, రెండు జట్లను ఫైనల్స్ కు పట్టుకెళ్ళటం బహుశా మునుపెన్నడూ ఏ కెప్టెన్ కు కూడా సాధ్య పది ఉండదు. 2024 ఐపీఎల్ లో కోల్కతా ను విజేతలు గా నిలబెట్టిన అయ్యర్, 2025 లో పంజాబ్ ను దశాబ్ద కాలం తరువాత ఫైనల్ కు చేర్చాడు.
అప్పటి నుండే శ్రేయాస్ అయ్యర్ భారత జట్టుకు కెప్టెన్ గా తిరిగిరావాలని ఫ్యాన్స్ ఆశించినప్పటికీ, టి-20 ప్రపంచ కప్ ముందు జట్టులో మార్పులు చేసే ఉద్దేశం లేక భారత మేనేజ్మెంట్ అయ్యర్ రాక ను కొంత కాలం పోస్ట్-పోన్ చేసారు. ఇక, టి-20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చిన అయ్యర్, కెప్టెన్ గా రావటం ఫ్యాన్స్ ను ఖుషి చేసింది.
ఇక, గత రెండేళ్ల నుండి ఐపీఎల్ లో అభిమానులందరి కళ్ళలో పడ్డ 15 ఏళ్ళ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఇండియా-ఏ తరపున ఆడనుండటం తో, అంతర్జాతీయ అరంగేట్రానికి కూడా పెద్ద సమయమేమి పట్టదని అనుకున్న ఫ్యాన్స్ అందరికి, బీసీసీఐ ఇవాళ అధికారికంగా సూర్యవంశీ ను టీం ఇండియా లో కి తీసుకున్నాం అంటూ ప్రకటించారు.
అప్పుడెప్పుడో 1988 లో 16 ఏళ్ళ వయసులో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన అతి చిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆ రికార్డును వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ళ వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగు పెడుతూ తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ కుర్రాడు ఐపీఎల్ లో ఆపొనెంట్ బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీరు తాగించాడు. క్రికెట్ ప్రపంచమే భయపడే బుమ్రా, కమిన్స్, భువి, హాజెల్వుడ్, సిరాజ్, రబాడా వంటి బౌలర్లపై చాలా సులువుగా బౌండరీలు బాదేశాడు ఈ బుడతడు.
ఇక, చివరిగా పైన రెండు వార్తలకు అభిమానులు ఎంత సంతోష పడ్డారో, చివరి వార్త తెలిసాక అభిమానులు అంతకు మించి బాధ పడ్డారు. కెప్టెన్ గా భారత్ కు ఒక టి-20 వరల్డ్ కప్ ను అందించి, ప్లేయర్ గా మరొక టి-20 వరల్డ్ కప్ విన్నర్ గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ ను వరల్డ్ కప్ గెలిచినప్పటికీ, తుది జట్టులో స్థానం లేకపోవటం అభిమానులను ఎంతగానో ఆందోళనలో పడేసింది.
సూర్య కు మరొక 2-3 సిరీస్ అవకాశం ఇస్తే బావుండేదా..? అన్న చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుంది. మరి ఈ విషయంలో మీరేం అనుకుంటున్నారు..?




