నేడు సింహాచల అప్పన్నస్వామి చందనోత్సవం

Simhachalam Chandanotsavam Draws Thousands of Devotees

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంత ప్రసిద్ధి చెందినవో, విశాఖలోని సింహాచలం పుణ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి చందనోత్సవం, గిరి ప్రదక్షిణ కూడా అంత ప్రసిద్దమైనవి.

శ్రీ మహావిష్ణువు రాక్షసుల బారి నుంచి ఈ లోకాన్ని కాపాడేందుకు వరాహవతారం, నరసింహావతారం దాల్చిన సంగతి తెలిసిందే. ఆ రెండు అవతారాల కలయికతో సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వెలిశారు. కనుక అత్యంత శక్తివంతమైన, ముక్తిదాయకమైన రూపంగా స్వామివారిని భక్తులు కొలుస్తారు.

ADVERTISEMENT

ఈ రెండు అవతారాలలో స్వామివారు ఉగ్రరూపం దాల్చి రాక్షసులతో పోరాడారు. కనుక స్వామివారి ఆగ్రహాన్ని చల్లబరిచేందుకు ఆలయ పురోహితులు ప్రతీ రోజూ చందనం అరగదీసి స్వామివారి విగ్రహానికి పూస్తుంటారు.

అలా ఏడాది పొడవునా పూసిన చందనాన్ని ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు తొలగించి భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తారు.

‘చందనోత్సవం’ తర్వాత స్వామివారి కల్యాణోత్సవ వేడుకలలో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, ఒడిస్సా తదితర రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన వేలాదిమంది భక్తులతో సింహాచలం కిటకిటలాడుతోంది.

నేడు సింహాచలం పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ చందనోత్సవానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో, ఏటా ఆషాడమాస పౌర్ణమి రోజున జరిగే గిరి ప్రదక్షిణకు అంతే ప్రాధాన్యత ఉంది.

ఆ రోజున వేలాది మంది భక్తులు తరలివచ్చి సుమారు 30 కిమీ కాలినడకన సింహాచలం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ రోజు తెల్లవారుజాము నుంచి మర్నాడు ఉదయం వరకు భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరిప్రదక్షిణ మద్యలో సముద్ర స్నానాలు కూడా చేస్తుంటారు.

నాడు శ్రీకృష్ణ దేవరాయలు, చోళ రాజులు సింహాచలం వచ్చి స్వామివారిని దర్శించుకున్నారంటే ఈ ఆలయం ఎంత విశిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories