
ప్రముఖ జాతీయ రాజకీయ నాయకుడు, కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) ఈరోజు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. గత నెల 19న ఊపిరి తిత్తులలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నేడు ఆయన పరిస్థితి విషమించడంతో కన్ను మూశారు.
Also Read – కవిత లో జోష్ బిఆర్ఎస్ కు వరమా.? శాపమా.?
ఉత్తరాదివారి చేతుల్లో ఉండే జాతీయ రాజకీయాలలో దక్షిణాదికి చెందిన నేతల మనుగడే చాలా కష్టం. పైగా దేశంలో వామపక్షాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్న ఈ సమయంలో సీపీఎంలో ఇంత సుదీర్గ కాలం జాతీయస్థాయి రాజకీయ నాయకుడుగా రాణించడం ఇంకా కష్టం. కానీ తెలుగువాడైన సీతారాం ఏచూరి జాతీయ రాజకీయ నాయకుడుగా, మంచి పార్లమెంటేరియన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు నేర్పరచుకున్నారు.
సీతారాం ఏచూరి తల్లి తండ్రులు చెన్నైలో స్థిరపడినప్పటికీ ఆయన విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది. అదే ఆయనకు కలిసి వచ్చిందని చెప్పవచ్చు. విద్యార్ధి దశలోనే అంటే 1974లోనే ఎస్‌ఎఫ్‌ఐలో సభ్యుడుగా చేరి మరుసటి సంవత్సరంలోనే తన ఆలోచనలకు, ఆశయాలకు సీపీఎం పార్టీ సరిపోతుందని గ్రహించి అందులో చేరారు. ఎమర్జన్సీ సమయంలో జైలుకి వెళ్ళిన నేతలలో ఆయన కూడా ఒకరు.
Also Read – వైసీపీ చేపల వేట ఫలించేనా?
సీతారాం ఏచూరి సీపీఎం పార్టీలో చేరినప్పటి నుంచి తుది శ్వాస విడిచేవరకు అదే పార్టీలో ఉన్నారు. సీపీఎంలో అంచలంచెలుగా ఎదుగుతూ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడుగా కీలక బాధ్యతలు, పదవులు నిర్వహించిన సీతారాం ఏచూరి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా… రాజ్యసభ చర్చలలో ఏ అంశంపైనైనా పూర్తి సాధికారంగా మాట్లాడే సీతారాం ఏచూరి ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి.
సీతారాం ఏచూరి మంచి రచయిత కూడా. పలు జాతీయ పత్రికలకు చక్కటి ఆర్టికల్స్ వ్రాశారు. పార్టీలకు అతీతంగా అందరితో కలిసిపోయేవారు. సీతారాం ఏచూరి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?
జాతీయ రాజకీయాలలో రాణించిన మన తెలుగు తేజం సీతారాం ఏచూరి మృతి పట్ల ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, రెండు తెలుగు రాష్ట్రాలలోని సీపీఐ, సీపీఎం నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.