ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆనాడు యూపీయే ప్రభుత్వం, ఇప్పుడు మోడీ ప్రభుత్వం రెండూ కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయని చెప్పక తప్పదు. లాభనష్టాలను లెక్కగట్టుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా పర్వాలేదనుకొని యూపీయే ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసింది. అది ఊహించినట్లుగానే ఏపీ రాష్ట్రం, ఏపీ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా నష్టపోయాయి. కానీ దాని లెక్కలు తప్పి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా తుడిచిపెట్టుకుపోయింది. అది వేరే విషయం.
రాష్ట్ర విభజనతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టేందుకు చేసిన గట్టి ప్రయత్నాల వలననే నేడు వైసీపీ ప్రభుత్వం పెద్దగా సమస్యలు ఎదుర్కొకుండా కాలక్షేపం చేసేయగలుగుతోందని చెప్పక తప్పదు. కనుక కాస్త గాడిలో పడిన రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం పెద్దగా కష్టపడక్కరలేకుండా అభివృద్ధి చేసి ఉండొచ్చు. కానీ 5 ఏళ్ళ తర్వాత రాబోయే ఎన్నికలలో కూడా వైసీపీని గెలిపించుకొనేందుకు సంక్షేమ పధకాల పేరుతో ఎడాపెడా అప్పులు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకొని వారించి ఉండొచ్చు. కానీ వారించకపోగా మరిన్ని అప్పులు ఇప్పిస్తూ ప్రోత్సహించింది. తత్ఫలితంగా నేడు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది.
ఓ పక్క రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా, రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నా ఏపీ బిజెపి కానీ, కేంద్ర ప్రభుత్వం గానీ పట్టించుకోలేదు. చివరికి… ప్రధాని మోడీ స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిని జగన్ ప్రభుత్వం పక్కన పడేసి మూడు రాజధానులని ఉద్యమాలు చేస్తున్నా మందలించలేదు!
రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని కనుక ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని పార్లమెంటులో కేంద్ర మంత్రులు చెపుతుంటే, ఇక్కడ ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు తమ ప్రభుత్వం అమరావతి రాజధానికే కట్టుబడి ఉందని చెపుతుంటారు. ఏపీ రాజధాని విషయంలో బిజెపి, మోడీ ప్రభుత్వ ద్వందవైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
ఈనెల 12వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ విశాఖపట్నంలో రూ.10,742 కోట్లు విలువగల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రాభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం ఇంత శ్రద్ద చూపడం చాలా సంతోషమే. అయితే వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నమే రాష్ట్ర రాజధాని అని గట్టిగా నొక్కి చెపుతున్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా విశాఖకు వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తుండటం ద్వారా వైసీపీ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రజలకు బలమైన సంకేతాలు పంపినట్లవుతుంది కదా?
బహుశః అందుకే ప్రధాని మోడీ విశాఖ పర్యటనకి సంబందించి అన్ని ఏర్పాట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దగ్గరుండి చేయిస్తున్నట్లున్నారు. అంతేకాదు… 12వ తేదీన ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో ప్రధాని నరేంద్రమోడీ, సిఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోయే బహిరంగసభకు వైసీపీ నేతలే జనసమీకరణ చేస్తున్నారు!
సోమూ వీర్రాజు సోమవారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ప్రధాని పర్యటనని వైసీపీ హైజాక్ చేయాలని ప్రయత్నిస్తోంది. మా ప్రభుత్వం అమరావతికే కట్టుబడి ఉంది. జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ ప్రజలను మోసం చేస్తూ కాలక్షేపం చేస్తోంది. విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుంటే వాటి క్రెడిట్ కొట్టేయలని జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది,” అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి విశాఖలో అభివృద్ధి పనులు చేపట్టడం చాలా అభినందనీయమే. అయితే సోమూ వీర్రాజు చెపుతున్నట్లు ‘ఏపీకి అమరావతే రాజధాని’ అనే మాటను 12న జరుగబోయే బహిరంగసభలో సిఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే ప్రధాని నరేంద్రమోడీ చేత చెప్పించగలిగితే బిజెపికి చిత్తశుద్ధి ఉందని భావించవచ్చు.
కానీ ప్రధాని ఆ మాట చెప్పరు. ఈ మూడు రాజధానుల డ్రామాలు ఇక చాలించమని కూడా జగన్‌కు చెప్పరు. ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారంటే ఏపీని ఓ రాష్ట్రంగా కాక రాజకీయ కోణంలో నుంచే బిజెపి చూస్తున్నందునే ‘నిర్లిప్తత అనే వ్యూహం’తో బిజెపి ముందుకు సాగుతున్నట్లు అర్దమవుతోంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏపీని, ప్రజలని చాలా లైట్‌గా తీసుకొని మూల్యం చెల్లించింది. ఇప్పుడు బిజెపి కూడా అదే చేస్తోంది. అయితే ఏపీలో బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక ఎంత లైట్ తీసుకొన్నా తమ పార్టీకి కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదనే ధీమాతోనే బిజెపి ఈవిదంగా వ్యవహరిస్తోందనిపిస్తోంది. కానీ అధికారం ఆశించిన రోజున ఏపీ ప్రజలు బిజెపిని క్షమిస్తారా?



