ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు టిడిపికి ఈరోజు ఓ చల్లటి కబురు చెప్పేరు. టిడిపితో బిజెపి పొత్తులు పెట్టుకోదలచుకోలేదని ప్రధాని నరేంద్రమోడీ పవన్ కళ్యాణ్‌కి స్పష్టంగా చెప్పేశారని సోమూ వీర్రాజు చెప్పారు. ఇంతకాలం బిజెపిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అది తమతో పొత్తులు పెట్టుకొంటుందో లేదో అని ఊగిసలాడుతోంది టిడిపి. కానీ ఎన్నికలకి ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే పొత్తుల విషయంలో బిజెపి స్పష్టత ఇచ్చేసింది కనుక ఇక టిడిపి బిజెపి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచే అభ్యర్ధులను ఖరారు చేసుకొంటే వారూ పూర్తిస్థాయిలో సన్నాహాలు చేసుకోగలుగుతారు. ఒకవేళ ఏవైనా లోతుపాట్లు ఉన్నా ఆలోగా టిడిపి సరిదిద్దుకోగలుగుతుంది. కనుక పొత్తుల విషయంలో బిజెపి స్పష్టత ఇచ్చేసినందుకు ప్రధాని నరేంద్రమోడీకి టిడిపి కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే.
ఈసారి జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని, నేను ముఖ్యమంత్రికాగానే ఫలానా ఫైలుపై తొలి సంతకం, ఫలానా ఫైలుపై రెండో సంతకం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ చెపుతుండటం గమనిస్తే వచ్చే ఎన్నికలలో జనసేన ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నట్లు అర్దమవుతోంది. అయితే ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయని పవన్ కళ్యాణ్ పదేపదే చెపుతున్నారు కనుక అందుకు తగ్గట్లుగానే నిర్ణయాలు తీసుకొంటారని భావించవచ్చు. టిడిపి, జనసేనల మద్య ఇప్పటికే పోటీ చేయబోయే స్థానాలపై కొంత అవగాహన ఉంది. కనుక కలిసి పోటీ చేసినా వేర్వేరుగా పోటీ చేసినా పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఈవిషయం వైసీపీ కూడా గ్రహించినట్లే ఉంది. అందుకే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్‌ని 175 సీట్లలో పోటీ చేస్తానని ప్రకటించాలని సవాళ్ళు విసురుతున్న వైసీపీ నేతలు ఇప్పుడు చంద్రబాబు నాయుడుని 175 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించాలని సవాళ్ళు విసరడం మొదలుపెట్టారు.
కనుక వచ్చే ఎన్నికలలో వైసీపీ, టిడిపి, జనసేనలు మూడింటి మద్య 175 సీట్లు చీలిపోవడం ఖాయంగానే ఉన్నాయి. ఒకవేళ వైసీపీకి ప్రభుత్వం ఏర్పాటుకి తగినన్ని సీట్లు రాకపోతే, టిడిపి, జనసేనలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగానే భావించవచ్చు.



