వేసవి సెలవుల తరువాత ఏపీలో మళ్ళీ పాఠశాలలు తెరుచుకొన్నాయి. పిల్లలు ఉత్సాహంగా వస్తే పాఠశాల గేట్లకు తాళాలు వేసుండటంతో ఆ చిన్నారులకు అర్ధం కాలేదు. ఎదురుగా తమ స్కూలు భవనం కనిపిస్తుంటే, గేటు దగ్గర నిలబడిన టీచర్లు “ఇప్పుడు మీ స్కూలు ఇక్కడ కాదు… పక్క ఊరులో ఉంది…” అని చెపుతుంటే వారికి అర్ధం కాలేదు. వారిని వెంటబెట్టుకొని వచ్చిన తల్లితండ్రులకు మొదట అర్ధం కాలేదు.
కానీ ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ, నూతన విద్యావిధానంలో భాగంగా కొన్ని స్కూళ్ళను మూసేసి వాటిని సమీపంలోని మరో స్కూలులో విలీనం చేశారని, కనుక విద్యార్దులందరూ పక్క ఊరిలో ఉన్న ఆ స్కూలుకి వెళ్ళి చదువుకోవాలని టీచర్లు చెప్పడంతో విద్యార్దుల తల్లితండ్రులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా హీరమండలంలోని శుభలయకాలనీ, కోరాడ కాలనీ, పలాసలోని మొగిలిపాడు పాఠశాలల విద్యార్దులు, తల్లితండ్రులతో కలిసి ఆ ప్రాంతంలో ప్రజలు రోడ్లపై బైటాయించి రాస్తారోకో చేసి నిరసనలు తెలిపారు.
ఆ ఒక్క జిల్లాలోనే రాష్ట్రంలో అన్ని జిల్లాలలోనూ ఇదేవిదంగా చేయడంతో పాఠశాలలు తెరుచుకొన్న తొలిరోజునే పిల్లలతో కలిసి తల్లితండ్రులు, గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో బండమీద జారవారిపల్లె, ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని పెదఉల్లగల్లు, చిన్న ఉలగల్లు గ్రామాలలో విద్యార్దులు, తల్లితండ్రులు, గ్రామస్తులు కలిసి రోడ్లపై బైటాయించి రాస్తారోకో చేసి నిరసనలు తెలిపారు.
అదేవిదంగా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో చెలిమేపల్లి గ్రామంలో గల ప్రాధమికోన్నత పాఠశాలలో 6,7,8 తరగతులలో విద్యార్దులు తక్కువగా ఉన్నారనే వంకతో అక్కడికి 3 కిమీ దూరంలో ఉన్న వేపులపర్తి గ్రామంలో ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో ముణిరత్నం కాలనీలోని ప్రాధమికోన్నత పాఠశాలలోని 6,7,8 తరగతులను ఎత్తేసి, కొంత దూరంలో ఉన్న పుదూరు జెడ్పీ హైస్కూల్లులో విలీనం చేయడంతో అక్కడా ఇదేవిదంగా తల్లితండ్రులు నిరసనలు తెలియజేస్తున్నారు.
ప్రాధమిక పాఠశాలలోని 3,4,5 తరగతులను ఒక కిమీ దూరంలో ఉన్న ప్రాధమికోన్నత పాఠశాలలో విలీనం చేస్తున్నారు. ఇప్పటివరకు 3,627 ప్రాధమిక పాఠశాలలను సమీపంలోని 3,178 ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. మరో 8,412 పాఠశాలలోని 3,4,5 తరగతులను తరలిస్తున్నారు. పాఠశాలలో 6,7,8 తరగతులలో 100లోపు విద్యార్దులు ఉన్నట్లయితే వాటిని 3 కిమీ దూరంలోనే ఉండే ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తున్నారు.
పాఠశాలల విలీనంతో విద్యార్దులు, తల్లితండ్రులకు ఎదురయ్యే సమస్యలను పక్కనబెడితే, ఒకేసారి వేరే పాఠశాల నుంచి వందలాది విద్యార్దులు వస్తే వారికి తరగతి గదులు ఉన్నాయా? విద్యార్దుల సంఖ్య పెరిగితే అందుకు తగ్గట్లుగా ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనానికి ఏర్పాట్లు ఉన్నాయా? అంటే లేవనే అర్దమవుతుంది.
పాఠశాలలను కుదించడం ద్వారా వాటి నిర్వహణ ఖర్చులు మిగుల్చుకోవచ్చు. ఆ తరువాత ఆ పాఠశాల భవనాలను సచివాలయాలగానో మరో దానికో వాడుకోవచ్చు. అలాగే మెల్లగా ఉపాధ్యాయులను తగ్గించుకొని ఆ భారం కూడా తగ్గించుకోవచ్చుననే దురాలోచన కనబడుతోంది.
నాడు-నేడు కార్యక్రమంతో కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించామని, ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్నప్పుడు, వాటిని ఇప్పుడు ఎందుకు మూసివేస్తున్నట్లు నాడు-నేడు పేరుతో? వాటిపై పెట్టిన కోట్ల రూపాయలు వృధా అయినట్లే కదా?
రాష్ట్రంలో పిల్లలందరూ చక్కగా చదువుకోవాలనే అమ్మఒడి పధకం అమలుచేస్తున్నామని గొప్పగా చెప్పుకొంటూ పాఠశాలల విలీనం పేరుతో మూసివేసి పిల్లలను చదువులకు దూరం చేయడం చాలా హాస్యస్పదంగా ఉంది. ఈ అనాలోచిత నిర్ణయం ప్రభావం విద్యార్దుల చదువులపై ఎలాగూ పడుతుంది. అది వచ్చే ఏడాది జరిగే వార్షిక పరీక్షల ఫలితాలలో కనబడుతుంది.



