Jagan Mohan Reddy

నాడు అక్రమాస్తుల కేసులు, ఓబులాపురం మైనింగ్ కేసులు మొదలు నేడు రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసు వరకు ప్రతీ కేసులో జగన్‌ అండ చూసుకొని చెలరేగిపోయిన అధికారులు లేదా ఆయన ఒత్తిళ్ళు భరించలేక తప్పుడు పనులు చేసిన అధికారులు కేసులలో చిక్కుకునే ఉంటున్నారు. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

అనేక మంది జైళ్ళకు కూడా వెళ్ళి వచ్చారు. జగన్‌ వల్ల, వైసీపీ నేతల సొంత తప్పిదాల వలన వైసీపీ నేతలు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటే వారు ఏదో విదంగా బయటపడగలరు. అవసరమైతే వారికి వైసీపీ తరపున అవసరమైన అండదండలు లభిస్తాయి.

Also Read – దానం: గోడ మీద పిల్లి మాదిరా.?

కానీ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన అధికారులు కూడా జగన్‌ కోసం తప్పుడు పనులు చేసి ఇటువంటి సమస్యలలో చిక్కుకోవడం చాలా బాధాకరమే కదా?

వారిచేత అటువంటి పనులు చేయించిన జగన్‌ వారు సమస్యలలో చిక్కుకుంటే పట్టించుకోకపోవడంతో ఇప్పుడు వారందరూ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు బాధపడుతున్నారు.

Also Read – వైసీపీ నేతల రిమాండ్ కష్టాలు…

గుంటూరు ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)మాజీ సూపరిండెంట్‌ ప్రభావతి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఒంటరి పోరాటం చేయాల్సి రావడమే ఇందుకు తాజా నిదర్శనం.

నాడు జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుని విచారణ పేరిట చిత్రహింసలు పెట్టగా, ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని ప్రభావతి సర్టిఫై చేశారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఆమె ఆవిదంగా చేసి ఉంటారని తెలుస్తూనే ఉంది.

Also Read – నారాయణ.. శల్యసారధ్యం చేస్తున్నారా?

నాడు గత్యంతరం లేక చేసిన పనికి నేడు ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడాల్సి వస్తోంది. ఈ కేసులో ఆమెని విచారణకు పిలిస్తే రావడం లేదని ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లుద్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళగా, తప్పనిసరిగా ఆమె కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది.

అయితే అక్కడ ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 7,8 తేదీలలో తప్పనిసరిగా ఈ కేసు విచారణకు హాజరవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

నిజానికి ఆమె ఓ సీనియర్ వైద్యురాలు. జీజీహెచ్ సూపరిండెంట్‌గా చాలా గౌరవనీయమైన పదవిలో రిటైర్ అయిన తర్వాత చాలా ప్రశాంతంగా జీవించవచ్చు. కానీ జగన్‌ ప్రభుత్వం ఒత్తిడి వలన చేసిన చిన్న తప్పుకి ఇప్పుడు ఆమె ప్రశాంతత కోల్పోవడమే కాకుండా, ఈ కేసులో నేరం రుజువైతే జైలుకి కూడా వెళ్ళాల్సివస్తుంది.

జగన్‌ కోసం పనిచేసిన రాజకీయ నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఏదో ఓ రోజు జైలుకి వెళ్ళాల్సి రావడాన్ని ఏమనుకోవాలి? జగన్‌ సృష్టించిన రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్లు 5 ఏళ్ళపాటు వైసీపీకి, ఆ పార్టీ నేతలకు వెట్టిచాకిరీ చేశారు. చివరికి వారిని కూడా జగన్‌ రోడ్డున పడేసి పోయారు కదా?




గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఆయన కోసం ఇంతమంది లోపలకు వెళ్ళి వస్తున్నారు. కానీ 12 ఏళ్ళుగా అక్రమాస్తుల కేసుల విచారణ సాగుతున్నా నేటికీ ఆ కేసులు కొలిక్కి రావడం లేదు. ఎవరూ ఆయనని టచ్ చేయలేకపోతున్నారు. అంటే రాజ్యాంగ వ్యవస్థల కంటే చాలా బలీయమైన శక్తిగా జగన్‌ ఎదిగిపోయారనుకోవాలేమో?