తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎప్పటిలానే ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి తెలంగాణ నాయకత్వానికి లింక్ పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రిపై ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు కూడా నాయకత్వం వహిస్తారు అన్నారు.
“ఏపీ నాయకులకు పోరాట స్ఫూర్తి లేదు… ఏపీ ప్రజలు కోరుకుంటే నాయకత్వానికి కేసీఆర్ సిద్ధమే… ఏపీలో ఉన్న అన్ని పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయి”, అని తలసాని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పొరుగు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తే మంచిదే కాకపోతే అంతకు ముందు అవిశ్వాసంపై తెరాస వ్యవహరిస్తున్న తీరుపై కూడా సమాధానం చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయంపై చర్చించే అవకాశం ఇస్తున్న అవిశ్వాసానికి తెరాస కావాలని అడ్డుపడుతున్న విషయం నిజం కాదా? తెరాస ఎంపీలు, ఐఏడీఎంకే ఎంపీలు గొడవ చేస్తున్న కారణం గా సభ ఆర్డరు లో లేదని అవిశ్వాసం చేపట్టడం కుదరదని స్పీకర్ తప్పించుకుని తిరుగుతున్నది నిజం కాదా? ఇలా వ్యవహరిస్తూ ఏపీకి ఎలా నాయకత్వం వహిస్తారు?



