సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా తమ పార్టీ దళితులకు, బీసీలకు చాలా గౌరవం, ప్రాధాన్యం ఇస్తుందని పదేపదే చెప్పుకొంటారు. అది నిరూపించుకొనేందుకు ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ మంత్రులతో బస్సుయాత్ర కూడా చేయించారు. కానీ వైసీపీ నేతలు చెప్పేదొకటి చేసేదొకటి అని గ్రహించేందుకు తాజా నిదర్శనం టిడిపి దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిని పోలీసులు అరెస్ట్ చేయడమే.
ఇన్నేళ్ళ తర్వాత టిడిపి హయాంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారంటూ కొండపి నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ వరికూటి అశోక్ బాబు నేతృత్వంలో వైసీపీ శ్రేణులు ఆయన ఇంటిని ముట్టడించడానికి సిద్దమయ్యాయి. ఇందుకోసం అశోక్ బాబు నేతృత్వంలో వైసీపీ కార్యకర్తలు టంగుటూరులో వైసీపీ కార్యాలయం వద్ద గుమిగూడారు.
ఈ విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి కూడా టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకొని అశోక్ బాబు ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరారు. దారిలో పోలీసులు వారిని అడ్డుకొని ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదివరకు గన్నవరంలో వల్లభనేని అనుచరులు కూడా ఇలాగే టిడిపి కార్యాలయంపై దాడి చేస్తున్నప్పుడు వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన టిడిపి సీనియర్ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు పల్నాడులో కూడా ఇదేవిదంగా జరిగింది. కనుక నేడు కొండపి నియోజకవర్గంలోని నాయుడుపాలెంలో తన ఇంటిపై కూడా వైసీపీ కార్యకర్తలు దాడి చేసేందుకు సిద్దమవుతున్నారని తెలిసి డోలా బాల వీరాంజనేయస్వామి అప్రమత్తమయ్యి, వారిని నిలువరించేందుకు అశోక్ బాబు ఇంటిని ముట్టడించేదుకు బయలుదేరారు తప్ప ఆయనకు అటువంటి అవసరం ఆలోచన రెండూ లేవు.
పట్టణంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేసినందుకు పోలీసులు అశోక్ బాబుని, అనుచరులని అరెస్ట్ చేయాల్సి ఉండగా, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిని అరెస్ట్ చేశారు. దళితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇదేనా? అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారు.



