NTR Brand

తెలుగు సినీ వినీలాకాశంలో ధృవతార, తెలుగు రాజకీయ యవనికపై చెరగని సంతకం, ఆంధ్రుల అభిమాన ‘అన్న’ ఎన్టీఆర్, అభిమానులకు ఎన్టీవోడు పరిచయం అక్కరలేని ఒక బ్రాండ్. ఆ సినీ, రాజకీయ దిగ్గజం ఈ లోకాన్ని విడిచి దాదాపుగా మూడు దశాబ్దాలయ్యింది కానీ ఈనాటికీ ఆయనని తలుచుకొని సినిమా అభిమాని ఉండడు, ఆయన ఊసు లేని ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో కానీ తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో కానీ జరగవనేది కాదనలేని సత్యం. గత సంవత్సరంలో జరిగిన తెలంగాణా ఎన్నికల్లో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ పోటీ చెయ్యకున్నా అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభిమానుల మద్దతుకోసం అన్ని పార్టీలు ఎన్టీఆర్ జపం చెయ్యడం చూసాం, ఇటీవల జరిగిన ఆంధ్రా ఎన్నికల్లో టిడిపి చరిత్రలో చూడని విజయం సాధించి అధికారంలోకి రావడం చూస్తే, ఇప్పటికీ ఆయన బ్రాండ్ వన్నె తగ్గలేదనే విషయం తెలుస్తుంది.

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ అధికారంలోకి రావడం ఒక ఎత్తైతే, ఆయన కుటుంబం నుండి ఐదు మంది ఈ ఎన్నికల్లో పోటీచేశారు. ఎన్టీఆర్ రెండోవ తరం నుండి అల్లుడు చంద్రబాబు, కొడుకు బాలకృష్ణ, కుమార్తె పురంధేశ్వరి పోటీ చెస్తే, మూడోవ తరం నుండి మనమళ్లు లోకేష్, భరత్ పోటీ చేసి అందరూ విజయం సాధించారు. వీరు పోటీ చేసిన నియోజకవర్గాలను చూస్తే బాలకృష్ణ రాష్ట్రానికి అటు మూల కర్ణాటకకు అనుకుని ఉన్న హిందూపురం నుండి పోటీ చేస్తే, చంద్రబాబు ఇంకో మూల తమిళనాడుకు అనుకుని ఉన్న కుప్పంలో పోటీ చేసారు. ఇంక ఒక మనమడు లోకేష్ మధ్యన ఉన్న కృష్ణా డెల్టా ప్రాంతంలోని మంగళగిరి నుండి పోటీ చేస్తే, కుమార్తె మరో డెల్టా ప్రాంతమైన ఎగువున ఉన్న గోదావరి ప్రాంతంలోని రాజమహేంద్రి నుండి ఎంపీ గా పోటీ చేసారు, చివరగా మరో మనుమడు భరత్ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖ పార్లమెంటరీ ప్రాంతం నుండి పోటీ చేసారు. ఆ విధంగా రాష్ట్రంలోని అన్ని దిక్కులా ఉన్న ఐదు ప్రధాన ప్రాంతాల నుండి పోటీ చేసి విజయం సాధించడం విశేషం.

Also Read – ప్రతీసారి ఒక దెబ్బకు రెండు పిట్టలంటే ఎలా?

వీరి విజయాలను పరిశీలించి చూస్తే, భరత్ విశాఖ ఎంపీ స్థానం నుండి 9,07,467 ఓట్ల నుండి 5,04,247 ఓట్ల మెజారిటీ, పురంధేశ్వరి 7,27,515 ఓట్ల నుండి 2,39, 129 ఓట్ల మెజారిటీ, బాలకృష్ణ 1,07,250 ఓట్ల నుండి 32,597 ఓట్ల మెజారిటీ, చంద్రబాబు 1,21,929 ఓట్ల నుండి 48,006 ఓట్ల మెజారిటీ, లోకేష్ 1,67,710 ఓట్ల నుండి 91,413 ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తంగా చూస్తే ఈ ఐదుగురూ సాధించిన ఓట్లు 20,31,871, ఇవి దాదాపు 5% ఓట్లకు సమానం. వీరిని ఒక పార్టీ గా చూస్తే 23 లక్షలు సాధించిన జనసేన తరువాత నిలుస్తుంది. 5 కి ఐదు గెలిచి విజయ శాతంలో జనసేనతో సమానంగా ఉంటుంది. వీరి ఐదుగురి మెజారిటీలు అన్నీ కలిపి 9,15,392, ఇది దాదాపు 10 సీట్లలో పోటీచేసి 9.53 లక్షల ఓట్లు సాధించిన బీజేపీకి సమానం.

అలాగే మరొక పెద్ద రాజకీయ కుటుంబం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుండి జగన్ మోహన్ రెడ్డి(1,16,315), షర్మిల రెడ్డి(1,41,039), అవినాష్ రెడ్డి(6,05,143), బాలినేని శ్రీనివాస్ రెడ్డి(84,774), రవీంద్రనాథ్ రెడ్డి(69,850), అభినయ్ రెడ్డి(62,151) కలిపి 10,79,272 ఓట్లు సాధించారు. వీరిలో నలుగురు పరాజయం పాలయ్యారు. వీరంతా కేవలం రాయలసీమ ప్రకాశం ప్రాంతంలోనే పోటీ చెయ్యగా, ఎన్టీఆర్ కుటుంబం నుండి రాష్ట్రం నలుమూలల నుండి పోటీ చేసి అందరూ విజయం సాధించడం విశేషం.

Also Read – ఏపీ బీజేపీ నేతలు అందుకే మౌనం?

బీసీలు ముస్లింలు ఎక్కువగా ఉన్న హిందూపురం, తమిళులు, బీసీలు ఎక్కువగా ఉన్న కుప్పం, బీసీలు, రెడ్లు, దళితులు ఎక్కువగా ఉన్న మంగళగిరి, కాపులు, బ్రాహ్మణులు, రెడ్లు, బీసీలు ఉన్న రాజమహేంద్రవరం, బ్రాహ్మణులు, ఉత్తరాది వారు, కాపులు, రాజులు, బీసీలు ఉన్న విశాఖ ఇలా వేరు వేరు ప్రాంతాల నుండి, వేరు వేరు వర్గాల ప్రజలు ఉన్న చోట వీరి గెలుపు రాష్ట్రంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకి అతీతంగా అన్న ఎన్టీఆర్ బ్రాండ్ ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఎంతలా ముద్ర వేసుకున్నదో తెలియచేస్తుంది.

శ్రీకాంత్.సి

Also Read – ఒకే బాటలో గురుశిష్యులు… ఎవరు కాదంటారు?