ఇవాళ్ళ 9వ తేదీ… ప్రైవేట్ కంపెనీలు కూడా ఈపాటికి తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించేస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు విజయనగరం జిల్లాలో ఉపాద్యాయులకు జీతాలు చెల్లించలేదు. తొమ్మిది రోజులు గడిచినా ఇంకా అకౌంట్లో జీతాలు పడకపోవడంతో ఈరోజు ఉదయం విజయనగరంలో ట్రెజరీ ఆఫీస్ వద్ద కొందరు ఉపాధ్యాయులు ధర్నా చేసి తక్షణం తమ జీతాలు చెల్లించవలసిందిగా కోరుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
సాధారణంగా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులలో చాలా మంది హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్ లేదా మరోటో తీసుకొంటుంటారు. ప్రతీనెల 2-3 తేదీలలో జీతాలు పడతాయనే నమ్మకంతో 5వ తేదీన ఈఎంఐ పేమెంట్స్ చేస్తుంటారు. కానీ ఈనెల 9వ తేదీ దాటిపోయినా ఇంత వరకు జీతాలు పడకపోవడంతో బ్యాంకులో చెక్కు బౌన్సు అవడం లేదా ఆలస్యంగా పేమెంట్ చేసినందుకు భారీగా జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలోని విజయనగరం టౌన్, నగరపాలక సంస్థ, రేగిడి, ఆమదాల వలస, జామి, దత్తిరాజేరు, గంట్యాడ, వేపాడ, రేగిడి, పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం టౌన్, పురపాలక సంఘం, గరుగుబిల్లి, వీరఘట్టం, సీతానగరం మండలలోని ఉపాధ్యాయులకు ఈరోజు సాయంత్రం వరకు జీతాలు పడకపోవడంటో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జామిలో ఉపాధ్యాయులు తమ స్కూల్ వద్దనే జీతాలు చెల్లించాలంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలుపగా, రెండు జిల్లాలలో పలువురు ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు.
జిల్లా యూటిఎఫ్ గౌరవాధ్యక్షుడు బి.జోగినాయుడు, అధ్యక్షుడు రమీష్ చంద్ర విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ, ఖజానా శాఖలో డీడీవోలో ఎటువంటి జాప్యం జరగలేదని మేము తెలుసుకొన్నాము. వారు సకాలంలోనే సీఎఫ్ఎంఎస్‌కు మాజీతాల తాలూకు బిల్లులు పంపించారు. కానీ ఇంతవరకు మా జీతాలు పడలేదు. సంబంధిత అధికారులని అడిగితే కనుక్కొని చెపుతామని పంపిస్తున్నారు తప్ప జీతాలు ఎందుకు పడలేదో? ఇంకా ఎప్పుడు పడతాయో చెప్పడం లేదన్నారు.
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలోనే ఉపాద్యాయులకు జీతాలు 9వ తేదీ వరకు పడకపోవడం విశేషం. జీతాలు పడకపోవడానికి కారణం కూడా తెలియకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ కలుగజేసుకొని తక్షణం తమ జీతాలు చెల్లించేలా అధికారులను ఆదేశించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.



