Telanagana Government Mahalakshmi Scheme

ఎన్నికలలో హామీలు ఇవ్వడం సులువు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయడం చాలా చాలా కష్టం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అలాగే ఇబ్బందులు పడుతోంది.

ప్రభుత్వం ఇబ్బంది పడితే ఎలాగో సర్దుకుపోవచ్చు కానీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నందుకు ఆయా సంస్థలు మునుగుతుంటేనే సమస్య మొదలవుతుంది.

Also Read – విజయశాంతి కోపం.. మరి సగటు ప్రేక్షకుడు?

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మహాలక్ష్మీ పధకం అమలుచేసింది. ఈ పధకంతో రాష్ట్రంలో మహిళలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ భారాన్ని టిజిఎస్ ఆర్టీసీ మోయలేదు కనుక రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. భరిస్తోంది కూడా.

దీని కోసం గత ఏడాది బడ్జెట్‌లో రూ.4,084 కోట్లు కేటాయించింది. కానీ ఆర్టీసీ బకాయిలు రూ.800 కోట్లు పేరుకుపోగా వారం రోజుల క్రితం కేవలం రూ.156 కోట్లు విడుదల చేసింది. మిగిలిన రూ.644 కోట్ల బకాయిలు ఇప్పటి వరకు విడుదల చేయలేదు!

Also Read – హైడ్రా ఎమ్మెల్యే వసంతపై పడిందేమిటో!

రేపు, ఎల్లుండి సెలవులు కనుక ఈరోజు సాయంత్రంలోగా నిధులు విడుదల చేయకపోతే, ఏప్రిల్ 1నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలవుతుంది కనుక కధ మళ్ళీ మొదటికి వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ లెక్కలన్నీ సరిచేసుకొని విడుదల చేసేసరికి టిజిఎస్ ఆర్టీసీపై భారం ఇంకా పెరిగిపోతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంటే ఓ రాజకీయ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీని అది అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో తేడా వస్తే ఏకంగా ఆర్టీసీ వంటి అతిపెద్ద సంస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుందని స్పష్టమవుతోంది.

Also Read – టాలీవుడ్ లో సీక్వెల్స్ జోరు – అవసరమా? ఆవశ్యకమా?

ఏపీ ఎన్నికలలో టీడీపీ కూడా ఇటువంటి హామీ ఇచ్చింది. కానీ అమలుచేయకపోవడంతో వైసీపీ తీవ్రంగా విమర్శిస్తోంది.

ఎన్నికలలో ప్రజలకు హామీ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా అమలుచేయాల్సిన బాధ్యత ఆ పార్టీ..దాని ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంపై దానిని నడిపిస్తున్న ముఖ్యమంత్రిపై తప్పక ఉంటుంది.

కానీ ఈ హామీని అమలుచేస్తుండటం వలన తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ ఎదుర్కొంటున్న ఆర్ధిక, ఉద్యోగ పరమైన సమస్యలను చూస్తున్నప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు ఈ హామీ అమలుకు తొందరపడకపోవడమే మంచిదనిపిస్తుంది.

హామీ నిలబెట్టుకోవడం కంటే సామాన్య ప్రజలకు అత్యవసరమైన ఆర్టీసీని మునిగిపోకుండా కాపాడుకోవడమే చాలా ముఖ్యం. అలాగని హామీని విస్మరించడం కూడా సరికాదు. కనీసం పరిమిత ప్రాంతాలలో, పరిమిత బస్సులలో ఈ పదకాన్ని అమలు చేసి హామీ నిలబెట్టుకుంటే బాగుంటుంది.