రెండు తెలుగు రాష్ట్రాల మద్య జలవివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
కేవలం నదీ జలాల కోసమే రెండు రాష్ట్రాలు తగువు పడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నదీ జలాల పేరుతో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నీచ రాజకీయాల వల్లనే ఇది పెద్ద సమస్యగా మారిందని చెప్పక తప్పదు.
బీఆర్ఎస్ పార్టీ మనుగడకు తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తూ ఉండటం చాలా అవసరం. అందుకు మన నదీ జలాలను ఏపీ దొంగిలించుకుపోతోందని వాదిస్తూ చేస్తూ ప్రజలను రెచ్చగొడుతుంటుంది.
ఈ పేరుతో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ మైలేజ్ పొందుతూ దూసుకుపోతుంటే, అధికార కాంగ్రెస్ ఈ రేసులో వెనుక బడిపోతామని ఆందోళన చెందడం సహజం. కనుక అది కూడా బీఆర్ఎస్ పార్టీతో పోటాపోటీగా నదీ జలాలపై ఏపీతో పేచీలకు సిద్దమవుతోంది.
అయితే తెలంగాణకు దిగువనున్న ఆంధ్రాలో నీళ్ళు వాడుకుంటే అభ్యంతరం చెపుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు, కృష్ణా గోదావరి జలాలను హైదరాబాద్‌తో సహా జిల్లాలకు మళ్ళించుకునేందుకు కొత్త ప్రాజెక్టులు కట్టడం తప్పుగా భావించడం లేదు. నదీ జలాలను వాడుకోవడం తమ హక్కుగా భావిస్తున్నాయి.
నిన్న తెలంగాణ శాసనసభ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మూసీ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసి హైదరాబాద్ తెస్తామని ప్రకటించడమే ఇందుకు తాజా నిదర్శనం.
అయితే ఎగువనున్న తెలంగాణలో అక్కడి ప్రభుత్వం ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నా ఏపీ ప్రభుత్వం పెద్దగా అభ్యంతరం తెలపడం లేదు. ఎందుకంటే, ఎన్ని కట్టుకున్నా ఇంకా వేల క్యూసెక్కుల నీళ్ళు ఏపీలోకి ప్రవహించి సముద్రంలో కలుస్తున్నాయనే విజ్ఞతతోనే.
ఆ నీటిని వాడుకుంటున్నా తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యంతరాలు తెలుపుతూ న్యాయ పోరాటాలు చేస్తున్నాయి.
తమ పోరాటాలు నీటి కోసమేనని కోర్టులు, ట్రిబ్యునల్స్‌కి నమ్మబలుకుతున్నాయి. కానీ వాస్తవానికి తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో మేమే నం.1 అని ప్రజల నమ్మిస్తూ రాజకీయ మైలేజ్ కోసం పోటీలు పడుతున్నాయి. వాటి మద్య జరిగే ఈ రాజకీయ మైలేజ్ పోటీలలో సిఎం చంద్రబాబు నాయుడు ముద్దాయిగా నిలబెడుతున్నాయి.
కనుక రెండు రాష్ట్రాల మద్య నదీ జలాల వివాదం నీళ్ళ కోసం కానే కాదు. ఆ నీళ్ళతో తెలంగాణ రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. ఆ రెంటినీ ఏ కమిటీ వేరు చేయలేదు.
బీఆర్ఎస్ పార్టీ మనుగడకి ఇదే ఆక్సిజన్ వంటిది. కనుక అది ఎట్టి పరిస్థితిలో వేరుచేయనీయదు కూడా. ఈ సమస్యని శాశ్వితంగా కొనసాగేలా కాపాడుకునేందుకు అది ఎన్ని పోరాటాలైనా చేస్తుంది. ఆ పోరాటాలు నీళ్ళ కోసమే… తెలంగాణ ప్రయోజనాల కోసమే అని నమ్మిస్తూనే ఉంటుంది.
కాలికి దెబ్బ తగిలితే చేతికి కట్టు వేసినా ప్రయోజనం ఉండనట్లే, బీఆర్ఎస్ పార్టీని ఈ నీళ్ళ రాజకీయాల నుంచి వేరు చేయనంతవరకు ఈ కమిటీలు, నివేధికలు అన్నీ వృధాయే అని చెప్పక తప్పదు.






