Hydra Demolition

తెలంగాణలో ఇదివరకు ఏ ప్రభుత్వం ఉన్నా నోరులేని పేదల ఇళ్ళు మాత్రమే కూల్చేసేది తప్ప పెద్దవారి జోలికి వెళ్ళేదే కాదు. కానీ తొలిసారిగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చిన్నా పెద్దా, పార్టీలు, రాజకీయ లెక్కలు చూసుకోకుండా హైడ్రా చేతికి హైదరాబాద్‌ నగరాన్ని అప్పగించేశారు.

అది బిఆర్ఎస్ నేతలకు చెందిన ఓ రెండు మూడు ఇళ్ళు మొక్కుబడిగా కూల్చేసిన తర్వాత కోర్టు కేసు పడగానే ఆగిపోతుందని అందరూ భావిస్తే ఎడా పెడా కూల్చేస్తోంది. హైడ్రా దెబ్బకు హైదరాబాద్‌ నగరంపై అణుబాంబు పడిన్నట్లు ఎక్కడ చూసినా శిధిలాలే కనిపిస్తున్నాయి.

Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!

అయితే ఈ కూల్చివేతలపై బిఆర్ఎస్‌ నేతలెవరూ గట్టిగా మాట్లాడకపోవడం గమనిస్తే ఏదో నోటికి వచ్చింది వాగి చేజేతులా హైడ్రా బుల్డోజర్లను మీదకి ఎక్కించుకోవడం ఎందుకని మౌనం వహిస్తున్నట్లనిపిస్తుంది.

సాధారణంగా ఇటువంటి సందర్భాలలో ప్రతిపక్షాలు తమ చేతికి మట్టి అంటకూడదని ఎవరో ఓ అనామకుడు చేత కోర్టులో కేసులు వేయిస్తుంటాయి. కానీ కేటీఆర్‌ లీజుకి తీసుకున్నాని చెపుతున్న జన్వాడ ఫామ్‌హౌస్‌ యజమాని ప్రదీప్ రెడ్డి తప్ప మరెవరూ హైకోర్టులో పిటిషన్‌ వేయలేదు. కనుక ప్రస్తుతానికి రేవంత్‌ రెడ్డి హైడ్రాతో బిఆర్ఎస్ నేతలని భయపెట్టి పైచేయి సాధించిన్నట్లే ఉన్నారు.

Also Read – నమ్మలేం దొరా…!

హైడ్రా కూల్చివేతలతో సరిపెట్టడంలేదు. చెరువులు, కాలువలు ఆక్రమించి ఇళ్ళు నిర్మించుకోవడానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఓ ఆరుగురు ఉన్నతాధికారుల పేర్లు చెప్పడం, వెంటనే వారిపై కేసులు నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ జాబితాలో మరో 50-75 మంది వరకు ఉన్నట్లు సమాచారం. కనుక ఇప్పుడు అధికారులలో కూడా గుబులు మొదలైంది.

హైదరాబాద్‌లో ఆక్రమణలను ఏ ప్రభుత్వం పట్టించుకోదని, ఒకవేళ పట్టించుకున్నా వాటిని కూల్చేస్తుందే తప్ప మన జోలికి ఎవరూ రారనే గుడ్డి ధీమాతో ఇంతకాలం అధికారులు, ఉద్యోగులు ఆక్రమణదారుల కొమ్ము కాశారు. కానీ ఇప్పుడు హైడ్రా తమ దాకా వచ్చేయడంతో ఏం చేయాలో… ఎవరిని ఆశ్రయించాలో తెలీని పరిస్థితిలో ఉన్నారు.

Also Read – హర్ష్ కుమార్‌కు వైసీపీ వైరస్ సోకిందా?

ఇవన్నీ కలిపి చూస్తే, ఇంతకీ రేవంత్‌ రెడ్డి శత్రువులని ఓడిస్తున్నారా… లేదా శత్రువులను సృష్టించుకుంటున్నారా? అనే అనుమానం కలుగకమానదు.

ఎందువల్ల అంటే రేవంత్‌ రెడ్డి (హైడ్రా) బాధితులందరూ తమవైపే వస్తారని కేసీఆర్‌ ఆశగా ఫామ్‌హౌస్‌లో ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన తొందరపడదలచుకోలేదు.

హైడ్రా ఎన్ని ఇళ్ళు, అపార్ట్‌మెంట్‌లు కూల్చేస్తే అంతమంది బాధితులు పెరుగుతారు. బహుశః అందుకే బిఆర్ఎస్ నేతలు హైడ్రా కూల్చివేతలపై పెద్దగా స్పందించడం లేదేమో?

కనుక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను హైడ్రా మార్చేయబోతోందా? హైడ్రా బిఆర్ఎస్ పార్టీని కూల్చేస్తుందా లేదా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తుందా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.