హైదరాబాద్‌లో తరచూ పబ్బులు, ఫామ్‌హౌసులలో డ్రగ్స్… వాటితో ప్రముఖులు పట్టుబడుతూనే ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కూడా తరచూ భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడుతూనే ఉంటాయి.
కనుక తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీమ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ వాడకం,సరఫరా, అమ్మకాలను కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది.
కానీ పలుకుబడి కలిగినవారు పట్టుబడినా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతోంది. కనుక హైదరాబాద్ డ్రగ్స్ వాడకం కొనసాగుతూనే ఉందని ఎప్పటికప్పుడు జరుగుతున్న రైడ్స్… వాటిలో పట్టుబడుతున్న డ్రగ్స్.. నిందితులపై కేసుల వార్తలతో స్పష్టమవుతోంది.
తాజాగా తెలంగాణ ఇంటర్ బోర్డ్ విధించిన ఓ కొత్త షరతు ఆ రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా, వాడకం ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తున్నట్లుంది.
నేటి నుంచి తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో ఇంటర్ ప్రధమ ప్రవేశాలు మొదలయ్యాయి. దరఖాస్తుతో పాటు ‘డ్రగ్స్ వాడబోము, డ్రగ్స్ సరఫరా, విక్రయాల్లో పాల్గొనము,” అని విద్యార్ధులతో పాటు వారి తల్లితండ్రులు కూడా సంతకాలు చేసిన అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. లేకుంటే ఇంటర్‌లో చేర్చుకోరు.
ఇది ముందస్తు జాగ్రత్త చర్య.. చాలా మంచి ఆలోచన అని అర్ధమవుతూనే ఉంది. కానీ అదే సమయంలో ఇంటర్ విద్యార్ధులు సైతం ‘డ్రగ్స్’కి అలవాటు పడుతున్నారనే విషయం కూడా బయటపెట్టినట్లయింది. ఈ ముందస్తు జాగ్రత్త చాలా అభినందనీయమే. కానీ ఈ పరిస్థితి చాలా ఆందోళనకరమే కదా?
పంజాబ్‌లో డ్రగ్స్ సరఫరా, వాడకంపై ‘ఉడ్తా పంజాబ్’ అనే సినిమా కూడా వచ్చింది. ప్రతీరోజు పంజాబ్ నుంచి ఒక రైలు నిండా ‘డ్రగ్స్’కు బానిసలైన రోగులు చికిత్స కోసం ఢిల్లీకి వస్తుంటారని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఆ రాష్ట్రంలో ఏ స్థాయిలో ‘డ్రగ్స్’ వినియోగిస్తున్నారో తెలియజేస్తోంది.
మొన్న 10వ తేదీన తమిళనాడు సిఎంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన సంతకం చేసిన మొదటి మూడు ఫైల్స్‌లో ఒకటి ‘డ్రగ్స్’ నియంత్రణకు సంబందించినదే కావడం గమనిస్తే దేశంలో డ్రగ్స్ చాప కింద నీరులా ఎంతగా వ్యాపిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
‘డ్రగ్స్’ కట్టడికి ప్రభుత్వాలు చట్టాలు, వ్యవస్థలు ఏర్పాటు చేసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ళు, అవసరాలు, ఓటు బ్యాంకు లెక్కల కారణంగా నిందితులపై కటిన చర్యలు తీసుకోలేనప్పుడు డ్రగ్స్ నిర్మూలన ఎన్నటికీ సాధ్యం కాదు.




