తెలంగాణలో జనసేనతో పొత్తు బిజేపికే ఎక్కువ అవసరం

BJP Janasena alliance in Telangana polls

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. అప్పుడే నామినేషన్స్ పర్వం మొదలైంది. ఫిభ్రవరి 11న పోలింగ్ జరుగబోతోంది.

ఈ ఎన్నికలలో జనసేన కూడా పోటీ చేయాలనుకుంటోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తనకు బలమున్న స్థానాలలోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

ఏపీలో జనసేన,బిజేపిలు కూటమిలో ఉన్నాయి. కనుక తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకొని పోటీ చేద్దామని జనసేన భావించింది. కానీ తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు జనసేనతో పొత్తు అవసరం లేదని, బిజేపి ఒంటరిగానే పోటీ చేసి గెలవగలదని స్పష్టం చేశారు.

ఇదే విషయం తమ అధిష్టానానికి తెలియజేస్తామని చెప్పారు. కానీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాము కట్టుబడి పనిచేస్తామని చెప్పారు.

రేపు శుక్రవారంతో నామినేషన్స్ గడువు ముగిసిపోతుంది. కనుక బిజేపితో పొత్తుల విషయం తేల్చుకునేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ నిన్న ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో భేటీ అయ్యారు.

ఒకవేళ పొత్తులు కుదిరితే ఈరోజే ఆ విషయం ప్రకటించి సీట్ల సర్దుబాట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే జనసేన అభ్యర్ధులు వెంటనే నామినేషన్స్ వేయడం మొదలుపెడతారు.

ఈ మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ జాగృతి కూడా అభ్యర్ధులను బరిలో దించుతోంది. కల్వకుంట్ల కవితకి బాగా పట్టున్న నిజామాబాద్‌లో అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు. దీని కోసం ఆమె ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీని దాని ఎన్నికల గుర్తు ‘సింహం’ని ఉపయోగించుకోబోతున్నారు. కనుక నిజామాబాద్‌లో అధికార కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బిజేపిలతో పాటు ఆమె అభ్యర్ధులు కూడా ఉంటారు.

జిహెచ్‌ఎంసి (హైదరాబాద్‌)తో సహా తెలంగాణలో మరి కొన్ని చోట్ల జనసేనకు వీరాభిమానులున్నారు. కనుక జనసేనతో బిజేపి పొత్తు పెట్టుకుంటే వారి మద్దతుతో పాటు టీడీపి అభిమానుల మద్దతు కూడా లభిస్తుంది. లేకుంటే టీడీపి, జనసేన అభిమానులు జనసేనకి అది లేనిచోట కాంగ్రెస్‌కి మొగ్గు చూపవచ్చు. కనుక జనసేనకు బిజేపి అవసరం కంటే జనసేన అవసరమే బిజేపికి ఉందని చెప్పవచ్చు.

మరి జనసేనతో పొత్తు పెట్టుకుంటుందో లేదా తెలంగాణ బిజేపి నేతలని నమ్ముకొని ఒంటరిగా బరిలో దిగి ఎప్పటిలాగే మళ్ళీ మూడో స్థానానికి పరిమితం అవుతుందో?

ADVERTISEMENT
Latest Stories