వరుణుడి ప్రకోపనానికి వరదలతో తెలంగాణలోని పలు జిల్లాలు కకావికలమైపోయాయి. ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో బుధ, గురు వారాల్లో కురిసిన వర్ష బీభత్సానికి ఆయా ప్రాంతాల ప్రజలు ఇప్పటికి భయం గుప్పెట్లోనే బిక్కుబిక్కుమంటున్నారు.
వర్షాలు తగ్గు ముఖం పట్టినప్పటికీ వరదలు తెచ్చిన బురదను వదిలించేందుకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఈ వర్షాల కారణంగా ఇంట్లోని అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయి నిరుపయోగంగా మారిపోయాయంటూ బాధితులు గొల్లుమంటున్నారు. అలాగే ఎంతో మంది ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి.
వారంతా తమ కుటుంబాలలో వరద తెచ్చిన విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇటు ప్రభుత్వం నుండి కూడా వరద బాధితులకు తక్షణ సాయం ఏమి ప్రకటించకపోవడంతో ప్రజలు ప్రభుత్వ చర్యల పై గుర్రుగా ఉన్నారు. తమ గోడు వినేందుకు గాని, తమ అవసరాలు తీర్చేందుకు కానీ ప్రభుత్వం నుంచి ఏ ఒక్క నేత కూడా తమవద్దకు రాలేదు అన్న ఆక్రోశం బాధితులలో కట్టలు తెచ్చుకుంటుంది.
అలాగే వరదలతో అల్లాడుతున్న జిల్లాల పర్యటనకు కాకుండా ముఖ్యమంత్రి రేవంత్, ఆయన మంత్రి మండలి కాళేశ్వరం అవినీతి అంటూ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల మీద విమర్శలకు పరిమితమవ్వడం కూడా రేవంత్ సర్కార్ ను విమర్శల పాలు చేస్తుంది.
ఈ సందర్భంగా గతఏడాది బుడమేరు ఉదంతాన్ని, అక్కడి ప్రభుత్వ చర్యలను గుర్తు చేసుకుంటున్నారు బాధితులు. గతేడాది ఏపీలో బుడమేరు పొంగి విజయవాడ ను వరద అష్టదిగ్బంధనం చేసినప్పటికీ ముఖ్యమంత్రి బాబు ఆ దిగ్బంధనాన్ని ఛేదించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం వరద సమీక్షల మీద, అక్కడి బాధిత ప్రజల అవసరాల మీద కేంద్రీకరించారు.
దానికి తోడు స్టార్ హోటల్స్ నుంచి చిన్న, పెద్దతరహా హోటల్స్ వరకు ఎవరి స్థాయికి తగ్గ సాయం వారు అందించాలంటూ అటు ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు ఇటు కార్పొరేట్ వ్యవస్థలకు పిలుపునిచ్చారు. దానికి తోడు దుర్గమ్మ ఆలయం నుండి భారీ ఎత్తున ఆహార పొట్లాలను సిద్ధం చేయించి బాధితులకు అందించేలా చర్యలు చేపట్టారు.
ఈ తంతు మొత్తం విజయవాడను వరదలు చుట్టుముట్టిన నాటి నుంచి బాధిత కుటుంబాలకు బురద ఉపశమనం కలిగే వరకు కొనసాగించారు. అలాగే ప్రభుత్వ సాయంతో ఆ వరద బురదను కూడా ఇంటింటికి వెళ్లి శుభ్రం చేసేలా బాబు అధికారులకు ఆదేశాలిచ్చారు.
అయితే ఇప్పుడు తెలంగాణలోని వరద ప్రభావానికి గురైన జిల్లాలన్నీ ఇంచుమించు బుడమేరు నాటి విషాదాన్ని తలపిస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రభుత్వ సాయం మాత్రం ఏపీ ప్రభుత్వం మాదిరి బాధిత కుటుంబాలకు అండగా నిలబడలేకపోతుంది అన్న విమర్శలైతే ఎదుర్కొంటుంది.
మరి రేవంత్ తన చర్యలతో ఈ వరద బురదను తొలగించుకుంటారా.? లేక ఒక హైడ్రా మాదిరి, ఒక యూరియా సమస్య తరహాలో సమస్యను పెంచుకుంటూ ప్రతిపక్షానికి ఆహారమవుతారా.?





