తెలంగాణ ఏర్పాటు అయితే ప్రజల జీవితాలు మారిపోతాయంటూ ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. చాలా సంతోషం. కానీ ప్రజల జీవితాలు మరిపోయాయా? అంటే లేదని జనం బాట పట్టిన కల్వకుంట్ల కవితే చెపుతున్నారు.
నేటికీ భూనిర్వాసితులకు న్యాయం జరుగలేదని, రింగ్ రోడ్లు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ళు, ఫామ్‌హౌసుల పక్క నుంచి మెలికలు తిరుగుతూ రైతుల పొలాల మీద నుంచి వెళుతున్నాయని కవితే చెపుతున్నారు. కాలేజీలలో అధ్యాపకులు లేరు… ఆస్పత్రులలో వైద్యులు లేరు. రైతుల కష్టాలకు అంతే లేదని చెపుతున్నారు.
కేసీఆర్ హయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని, కల్వకుంట్ల కుటుంబం వేల ఎకరాలు కబ్జాలు చేసి ఫామ్‌హౌసులు కట్టుకొన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. చివరికి గ్రూప్ పరీక్షలను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారని, ప్రశ్నాపత్రాలు లీక్ చేసి డబ్బులు దండుకున్నారని ఇదివరకు రేవంత్ రెడ్డి పలుమార్లు ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్, ఎఫ్-1 రేసింగ్ కేసు, ధరణి ఇలా ప్రతీచోట అవినీతి, అక్రమాలకు పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని యదేచ్చగా దోపిడీ చేసి వేలకోట్లు పోగేసుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ కేసులన్నీ బయటకు తీసి విచారణ మొదలుపెడితే ప్రభుత్వం స్థంభించిపోతుందని అందుకే కొన్ని కేసులు మాత్రమే చేపట్టామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ అన్ని రంగాలలో భ్రష్టు పట్టించేసిందని, మంత్రులందరూ కమీషన్లు దండుకొంటున్నారని కేటీఆర్ తదితర బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కలే సుమారు రూ. 4-5 లక్షల కోట్లు విలువగల 3,292 ఎకరాల ప్రభుత్వ భూములను సిఎం రేవంత్ రెడ్డి తన మంత్రులు, బంధు మిత్రులు, కుటుంబ సభ్యులకు దోచిపెట్టేందుకు అతిపెద్ద భూకుంభకోణానికి తెర తీశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు సంచలన ఆరోపణలు చేశారు.
ఆంధ్రా పాలకులు దోపిడీకి, వివక్షకు గురైన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకునేందుకు, ప్రజలకు మేలు చేసేందుకే తెలంగాణ అవసరమని కేసీఆర్ అండ్ కో వాదించేవారు.
కానీ ఇప్పుడు ఇవన్నీ కలిపి చూస్తే, తెలంగాణ ఏర్పాటు వలన ఎవరెవరు లాభాపడుతున్నారో… ఏం జరిగిందో… ఏం జరుగుతోందో స్పష్టమవుతోంది. తెలంగాణ ఏర్పడింది ప్రజల కోసమా రాజకీయ పార్టీలు, వాటి నాయకుల కోసమా?






