ఏపీకి రామంటే రామని మొండికేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్ బుధవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవింగ్ ఆర్డర్స్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌ని కలిసి డ్యూటీలో జాయిన్ అవుతున్నట్లు రిపోర్ట్ చేశారు.
వారు నలుగురు తెలంగాణ ప్రభుత్వంలో చాలా పాపులర్ అధికారులు. మంచి సమర్దులుగా పేరు సంపాదించుకున్నారు. కనుక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని ఎరికోరి తన ప్రభుత్వంలో కీలకశాఖలు అప్పజెప్పి మంచి ఉన్నత పదవులు ఇచ్చారు.
ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా వారికి చాలా ప్రాధాన్యం ఇచ్చి తన ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వర్తిస్తున్నారు.
వారిలో ఆమ్రపాలి హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) కమీషనర్‌గా పనిచేస్తుండగా, వాకాటి కరుణ మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా, రోనాల్డ్ రాస్ ఇంధనశాఖ కార్యదర్శిగా, వాణీ ప్రసాద్ యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత వారితో సహా మరికొందరిని ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించబడ్డారు. కానీ ట్రిబ్యూనల్లో కేసులు వేసి ఇంతకాలం తెలంగాణలో కొనసాగారు. కానీ ఇప్పుడు ట్రిబ్యూనల్ కూడా వారు ఆంధ్రకు వెళ్ళాలని చెప్పడంతో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై నిన్న విచారణ చేపట్టిన హైకోర్టు కూడా వారిని సున్నితంగా మందలించి తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సూచించడంతో అయిష్టంగానే ఏపీకి వచ్చారు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సేవలను ఎక్కడ ఏవిదంగా ఉపయోగించుకోబోతోందో నేడో రేపో తెలుస్తుంది.






