ప్రభుత్వ లేదా ప్రతిపక్ష జనాధరణకు గీటురాయి ఏమిటి? అంటే ఎన్నికలే. వాటిలో గెలిస్తే జనాధరణ ఉన్నట్లు లేకుంటే లేనట్లు అనుకోవడానికి కూడా లేదు. ఉదాహరణకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గీటురాయి అని కేటీఆర్ వాదించేవారు. కానీ కాంగ్రెస్ గెలిచి తాము ఓడిపోతే అదేమీ గీటురాయి కాదని తప్పించుకున్నారు.
ఫిభ్రవరి 11న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకే ఒక్క నియోజకవర్గానికి పరిమితం. కానీ ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీలలో జరుగుతున్నాయి. కనుక మూడు ప్రధాన పార్టీలు మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నాయి.
వీటిలో మెజార్టీ స్థానాలు దక్కించుకోలేకపోతే కుంటిసాకులు చెప్పి తప్పించుకోలేవు. వాటికి ఆయా ప్రాంతాలలో పట్టులేదని లేదా అక్కడ పార్టీ బలహీనంగా ఉందని చాటింపు వేసుకున్నట్లవుతుంది.
ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, దానిని నిత్యం సవాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకం.
ఈ రెండింటిలో ఏది ఎక్కువ స్థానాలు దక్కించుకుంటే దాని రాజకీయ ఆధిపత్యం ఇంకా పెరుగుతుంది. అప్పటి నుంచి ఆయా ప్రాంతాలలో తమ రాజకీయ ప్రత్యర్ధిని బలహీనపరిచి రాజకీయంగా చావు దెబ్బ తీయగలుగుతుంది. కనుక ఈ ఎన్నికలు ఆ రెండు పార్టీలకు అగ్నిపరీక్ష వంటివే. వాటి జనాధరణకు, పనితీరుకు గీటు రాయి వంటివే అని భావించవచ్చు.
ఏపీతో పోలిస్తే తెలంగాణలో బిజేపి చాలా బలంగా ఉంది. కానీ తెలంగాణలో బిజేపి పుంజుకోలేకపోతోంది. రాష్ట్ర స్థాయి నాయకుల మద్య సఖ్యత, అవగాహన లేకపోవడం వల్లనే తెలంగాణలో బిజేపి ఎప్పుడూ మూడోస్థానంలోనే ఉండిపోతోంది.
ఇటీవలే ప్రధాని మోడీ తెలంగాణ బిజేపి నాయకులకు మొట్టికాయలు వేసినట్లు సమాచారం. కనుక ఈసారి బిజేపి కూడా గట్టిగా ప్రయత్నించవచ్చు.
బిజేపితో పొత్తుకు జనసేన సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ అక్కర్లేదని చెప్పడం, తెలంగాణ బిజేపి నేతల అతివిశ్వాసానికి నిదర్శనంగా చూడవచ్చు. పార్టీ నేతాల మద్య ఎలాగూ ఐకమత్యం లేదు. కనీసం పొత్తుకి సిద్ధపడిన మిత్రపక్షాన్ని కూడా వద్దనుకుంటున్నారు. కనుక ఈ ఎన్నికలలో కూడా బిజేపి మళ్ళీ మూడో స్థానంతో సరిపెట్టుకుంటుందేమో?






