తెలంగాణ రాజకీయాలు త్రిముఖ పోటీ మాదిరి కాకుండా ట్రయాంగిల్ త్రిల్లర్ మాదిరి సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ – బీజేపీ చీకటి ఒప్పందాలు అంటూ ఒకరు, బిఆర్ఎస్ – బీజేపీ తెరచాటు బంధాలు అంటూ మరొకరు ఒకరి మీద ఒకరు బీజేపీ తో సంబంధాలను ప్రచారం చేసుకుంటున్నాయి.
అలాగే ఇటు బీజేపీ సైతం కాంగ్రెస్ – బిఆర్ఎస్ కలిపే రాజకీయం నడుపుతున్నారంటూ రెండు పార్టీల పై విమర్శలు ఎక్కుపెడుతుంది. అయితే ఈ మూడు పార్టీల మధ్య రాజకీయ పోటీ ఏ విధంగా కొనసాగుతుంది అంటే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి.
కానీ ఆ ఆరోపణలకు బలమైన ఆధారాలు, అంత కంటే బలమైన చట్టబద్దమైన చర్యలు చేయలేకపోతున్నాయి. కాళేశ్వరం లో అవినీతి అంటూ ఇటు రాష్ట్ర అధికార పార్టీ అటు కేంద్ర అధికార పార్టీ రెండు కూడా బిఆర్ఎస్ ను దొంగ గానే చూపిస్తున్నాయి.
కానీ ఆ దొంగ ను పట్టుకునే పోలీస్ మాత్రం నువ్వంటే నువ్వే అంటూ ఒకరికొకరు తమ భుజాల మీదనున్న బాధ్యతను ఎదురు వాడి తల మీద పెట్టేందు ప్రయత్నిస్తున్నాయి. కాళేశ్వరం పై అవినీతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విచారణ అంటూ కాంగ్రెస్ ఆర్భాటంగా ప్రకటనలు చేసి ఆ బాల్ ని సీబీఐ కోర్టులో వేసి బీజేపీ నెత్తిన పెట్టి తానూ తప్పుకుంది.
ఇక బీజేపీ కాంగ్రెస్ తెలివిగా తానూ తప్పించుకుని, తనను ఇరికించిన కాళేశ్వరం పంచాయితీ లో ముందుకెళ్లలేక, వెనక్కి రాలేక అలా స్తబ్దుగా నిలబడిపోయింది. కాంగ్రెస్ తన కోర్టులో వేసిన కేసును పక్కన పెట్టి కాంగ్రెస్ గ్రౌండ్ లో ఉన్న ఫోన్ టాపింగ్ పై బిఆర్ఎస్ నేతల పై చర్యలేవి అంటూ రేవంత్ సర్కారు పై ఒత్తిడి తెచ్చేందుకు సిద్దమయ్యింది.
తాజాగా తెలంగాణలో హాట్ టాపిక్ అయిన ఫోన్ టాపింగ్ కేసు పై బండి సంజయ్ దూకుడు పెంచారు. రెండు రోజులుగా ఫోన్ టాపింగ్ కేసులో విచారణ అంటూ మాజీ మంత్రి హరీష్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని సిట్ ముందుకు తెచ్చింది కాంగ్రెస్.
అయితే ఈ విషయంలో బీజేపీ స్పందిస్తూ, టాపింగ్ కేసులో ప్రభుత్వం వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ కేసీఆర్ కుటుంబం పై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతుంది వై.? అంటూ కాంగ్రెస్ ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. రేవంత్ సర్కారు అసమర్థ ప్రభుత్వం అయిపోయిందా.? కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ధైర్యం లేదా.? అంటూ రెచ్చిపోతుంది.
అయితే ఈ రెండు పార్టీల దృష్టిలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు, అవినీతికి పాల్పడిందనేది వాస్తవం. బిఆర్ఎస్ అవినీతి దొంగ అనే మాటకు రెండు పార్టీలు కట్టుబడే ఉంటున్నాయి. కానీ ఆ దొంగను పట్టుకునేందుకు తమ తమ ప్రభుత్వాల వద్ద ఉన్న అధికారం అనే అస్త్రాన్ని బయటకు తీసేందుకు మాత్రం రెండు పార్టీలు కూడా వెనకడుగే వేస్తున్నాయి.
అంటే రెండు పార్టీలకు దొంగ కామనే కానీ ఆ దొంగను పట్టుకునే పోలీస్ ఎవరన్నది రెండు పార్టీలకు స్పష్టత లేదు. దీని బట్టి తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ ల రాజకీయ ముఖ చిత్రం ట్రయాంగిల్ త్రిల్లర్ మాదిరి దొంగ నువ్వే పోలీస్ మాత్రం నేను కాదు అనే ఒక లూప్ లో తిరుగుతుందన్న మాట..!






