ఏపీ శాసనసభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించడానికి జరిగిన పోటీలు అందరూ చూశారు. అదేవిదంగా ఇప్పుడు తెలంగాణలో బీసీలను ఆకర్షించడానికి పార్టీల మద్య పోటీ మొదలైంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్స్ అంశంతో వారిని ఆకర్షించాలని ప్రయత్నిస్తుంటే, నేను చేసిన పోరాటాల వలననే రేవంత్ రెడ్డి దిగివచ్చి బీసీ రిజర్వేషన్స్ ఇస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పుకున్నారు. కానీ బీసీల పట్ల తమకు మాత్రమే నిబద్దత ఉందని కేటీఆర్, హరీష్ రావులు చెప్పుకుంటున్నారు.
మరోపక్క ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా బీసీల కోసమే ఏర్పాటు చేసిన పార్టీ తమదని చెప్పుకుంటున్నారు.
ఇలా బీసీలను ఆకర్షించడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటుండగానే, తీన్మార్ మల్లన్న నేడు ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ ప్రకటించారు. ఎరుపు, పచ్చరంగులతో రూపొందించిన పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, “ఇంతకాలం అన్ని పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయి. కానీ మా పార్టీ బీసీలకు రాజ్యాధికారం కల్పించాలనే ఏకైక లక్ష్యం ఏర్పాటు చేశాము,” అని చెప్పారు.
ఇదివరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీ జెండాతో రాష్ట్రంలో ‘దళితులకు రాజ్యాధికారం’ ఇప్పిస్తానంటూ తిరిగారు. కానీ దళితులు ఆయనని నమ్మలేదు. ఎన్నికలలో డిపాజిట్ కూడా దక్కలేదు. దాంతో ఆయన వెళ్ళి తాను ఏ వెలమదొర కేసీఆర్‌ని విమర్శించారో ఆయన పంచనే చేరిపోయారు.
ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు అటువంటి పరిస్థితే ఎదురవవచ్చు. ఎందుకంటే ఓటర్లను, ఎన్నికల ఫలితాలను డబ్బే శాసిస్తుంది కనుక. ఈ విషయంలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్, బీజేపి, బీఆర్ఎస్ పార్టీలో పోటీ పడలేరు కనుక.
చివరిగా ఓ సందేహం. ఈ రాజకీయ పార్టీల తాపత్రయం బీసీలను ఉద్దరించడానికా లేక వారిని వాడుకొని రాజ్యాధికారం సంపాదించుకోవడానికా? ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు.




