నీళ్లు,నిధులు,నియామకాలు ఇవేనా?

KCR Telangana water funds

దేశానికే అన్నపూర్ణగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నీళ్లు – నిధులు – నియామకాలు అనే మూడు కారణాలతో తెలంగాణ – ఆంధ్రా అంటూ రెండు ముక్కలయ్యింది. ఈ మూడు అంశాలను తెరమీదకు తెచ్చి ఆంధ్రోళ్లు తెలంగాణ ప్రాంతాన్ని, ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ రెండు ప్రాంతాల మధ్య విభేదాలు – విద్వేషాలు సృష్టించి ఎట్టకేలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని వారి వారి రాజకీయ స్వలాభాల కోసం రెండు ముక్కలు చేసాయి రాజకీయ పార్టీలు.

అయితే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ నిలబడితే తెలంగాణ తెచ్చిన పార్టీగా తెరాస పేరు గడించింది. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్న ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి తెలంగాణ ఏర్పడానికి కేసీఆర్ పాత్ర అత్యంత కీలకం అని చెప్పడంలో మరో ఆలోచనే అవసరం లేదు.

ADVERTISEMENT

దశాబ్దాల పాటు ఉద్యమ పోరాటాలు చేసి, రాజకీయ పొత్తులు పెట్టుకుని, ఎత్తులు వేసుకుని, నిరాహార దీక్షలు చేసి కేసీఆర్ చేసిన ఈ పోరాటాలు చివరికి లక్ష్యాన్ని అందుకున్నాయా.? తెలంగాణ నీటి హక్కులను కాపాడుకున్నాయా.? నిధులను సమకూర్చుకోగలిగిందా.? నియామకాల కల్పన చేయగలిగిందా.? అంటే అందుకు కేసీఆర్ కానీ తెరాస గా మారిన బిఆర్ఎస్ కానీ సమాధానం చెప్పగలదా.?

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత ఏకంగా 10 ఏళ్ళ పాటు తెలంగాణలో కేసీఆర్ పార్టీనే అధికారంలో ఉంది, అలాగే ఆ సమయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షమన్నదే లేకుండా దశాబ్దం పాటు ఏకచక్రాధిపత్యం గా పాలన చేసారు. తెలంగాణలో రాజ్యమేలారు.

మరి ఈ సందర్భంలో కేసీఆర్ పాలనలో కూడా తెలంగాణకు ఇంకా న్యాయం జరగలేదా.? తెలంగాణ నీటి కష్టాలు ఇప్పటికి తీరలేదా.? తెలంగాణ ఇప్పటికి ఏపీ పై నీటి కోసం రాజకీయ యుద్దాలు చేయడానికి కారణం ఏమిటి.? ఎవరు.? ప్రత్యేక రాష్ట్ర సాధన తరువాత కూడా కేసీఆర్ ఇంకా తెలంగాణ నీటి హక్కులు అంటూ ఎందుకు ఉద్యమిస్తున్నారు.? కాంగ్రెస్ ని ఎందుకు రెచ్చకొడుతున్నారు.?

అంటే పదేళ్లలో కేసీఆర్ తెలంగాణ నీటి హక్కుల సాధన కోసం చేసింది శూన్యమనాలా.? ఆంధ్రోళ్ళు అన్యాయం చేసారంటూ నాడు గళం విప్పిన కేసీఆర్ ఇప్పటికే అదే స్టాండ్ మీద ఉన్నారంటే కేసీఆర్ హయాంలో కూడా తెలంగాణ నీటి సమస్యకు ఒక పరిష్కారం చూపలేదా.? అయితే నాడు కేసీఆర్ చేసిన పోరాటాలు – ఉద్యమాలు అన్ని ప్రత్యేక తెలంగాణ అభివృద్ధి కోసం కాదా.? తెరాస ని బిఆర్ఎస్ గా మార్చడం కోసమేనా.?

పదేళ్ల కాలంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న కేసీఆర్ తెరాస జాతీయ పార్టీగా అప్ డేట్ అయ్యింది కానీ తెలంగాణ – ఆంధ్రా మధ్య ఉన్న ప్రాంతీయ సమస్యలకు ఇప్పటికి ఒక పరిష్కారం దొరకలేదా.? అంటే అది కేసీఆర్ అసమర్థత అవుతుంది కానీ ఏపీ అన్యాయం ఎలా అవుతుంది.?

ఇక నిధుల విషయానికొస్తే.., రాష్ట్ర విభజన తరువాత మిగులు బడ్జెట్ తో తెలంగాణ బిఆర్ఎస్ చేతికొచ్చింది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కేసీఆర్ ఆ మిగులు బడ్జెట్ ని లక్షల కోట్ల అప్పులుగా ఎలా మార్చగలిగారు.? అంటే కేసీఆర్ దృష్టిలో నిధులు అంటే అప్పులనా.?

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నిధుల విడుదలలో అన్యాయం జరిగిందంటూ నాడు ఉద్యమించిన కేసీఆర్ రాష్ట్ర విభజనతోనే తెలంగాణలో మిగులు బడ్జెట్ ను ఎలా పొందగలిగారు.? నాడు తెలంగాణలో జరగని అభివృద్ధి నేడు జరిగితే ఇప్పటికి తెలంగాణ ఎందుకు వెనుకబాటును ఎదుర్కొంటుంది.? నిధుల కోసం అప్పుల వేటకై ఎందుకు పరుగులు పెడుతున్నట్టు.? అంటే కేసీఆర్ హయాంలో తెలంగాణకు వచ్చిన నిధులన్నీ అప్పులేనా.?

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నియామకాలు..,ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోకి యువత రాకకు ముఖ్య కారణం నియామకాలు. తెలంగాణ యువతకు ఉద్యోగాల విషయంలో అన్యాయం జరుగుతుంది, ఇక్కడి యువత ఉపాధి కోసం వలస పోవాల్సి వస్తుంది, తెలంగాణ యువత ఉద్యగావకాశాలను ఏపీ ప్రజలు కొట్టేస్తున్నారు,

ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే తెలంగాణలో నిరుద్యోగం అన్న మాటే వినపడదు, మన తెలంగాణ మన హక్కు అంటూ నాడు కేసీఆర్ యువతను రెచ్చకొట్టారు, ఉద్యమాలలోకి తీసుకొచ్చారు, వారి ప్రాణ త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మరి రాష్ట్ర విభజన అంశంలో ఇంత ప్రధాన భూమిక పోషించిన ఈ నియామకాలను కేసీఆర్ ప్రభుత్వం సంపూర్ణం చేసిందా.?

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అసలు ఈ నియామకాల అంశాన్ని కేసీఆర్ పట్టించుకున్నారా.? తెరాస ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్ని నోటిఫికెషన్స్ పడ్డాయి.? వాటిలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు.? అలా కల్పిస్తే తెలంగాణలో అసలు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికెషన్స్ కోర్టులో ఎందుకు రద్దు చేయబడ్డాయి, అసలు ఎందుకు ఆ నోటిఫికేషన్ అమలు కాలేకపోయింది.?

దీనిబట్టి చూస్తే.., ప్రత్యేక తెలంగాణ వస్తేనే బంగారు తెలంగాణ అవుతుంది, ఇక్కడ నీళ్లు నిధులు – నియామకాలు అన్ని కూడా తెలంగాణ ప్రజలు సొంతమవుతాయి, ఇక తెలంగాణకు నీళ్ల సమస్య రాదు, తెలంగాణ అభివృద్ధికి నిధుల కొరత ఉండదు, నియామకాలన్నీ కూడా తెలంగాణ యువత కే సొంత అంటూ కేసీఆర్ చెప్పిన కబుర్లన్నీ చందమామ కథలేనా.?

ఇప్పటికి తెలంగాణ నీళ్ళ కోసం ఏపీ వైపు, నిధుల కోసం కేంద్ర చుట్టూ, నియామకాల కోసం న్యాయస్థానాల చుట్టూ ఎందుకు తిరుగుతుంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే అప్పటికి ఇప్పటికి ఎం మారింది.? ఎవరు అభివృద్ధి చెందారు.? ఎవరు నష్టపోయారు.? నాటి కేసీఆర్ విమర్శలు రాష్ట్ర ఏర్పాటు కోసమైతే నేటి బిఆర్ఎస్ ఆరోపణలు పార్టీ ప్రయోజనాల కోసమా.? లేక నాటి నిందలు పార్టీ రాజకీయ లబ్ది కోసమైతే నేటి దూషణలు ఎవరి కోసం.?

ADVERTISEMENT
Latest Stories