బిఆర్ఎస్ వ్యూహాత్మకంగా వైసీపీ ని తప్పిస్తుందా.?

Telangana water politics heats up as BRS targets TDP while YSRCP remains out of the spotlight

పిల్లి ఎలక పోరు మరెవరినో రక్షించింది అనేలా తెలంగాణ అధికార – ప్రతిపక్షాల నీటి పంచాయితీలోకి బిఆర్ఎస్ వ్యూహాత్మకంగా టీడీపీ ని లాగి వైసీపీ ని సేఫ్ జోన్ లో పెట్టిందా.? లేక అసలు వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో ఎటువంటి నీటి ప్రాజెక్టులు నిర్మించలేదా.? లేదా పూర్తి చెయ్యలేదా.?

అయితే ఇప్పుడు పిపిటి రూపంలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ – బిఆర్ఎస్ ల మధ్య మొదలైన నీటి పంచాయితీల చర్చలోకి 2014 లో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వాన్ని లాగుతున్నారు, 2024 లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని లాగుతున్నారు కానీ 2019 – 2024 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ ని ఏ ఒక్క పార్టీ కూడా టార్గెట్ చెయ్యడం లేదు వై.?

ADVERTISEMENT

నాడు ఏపీ ప్రముఖ నీటి ప్రాజెక్ట్ అయిన పోలవరం నిర్మాణాల మీద ఆరోపణలు చేసిన బిఆర్ఎస్ పోలవరం నిర్వాసిత గ్రామాలను తెలంగాణ నుంచి వేరు చేసారు అంటూ ముఖ్యమంత్రి బాబు పై పడ్డారు. ఇక నేడు తెలంగాణ నదీజలాలను చంద్రబాబు అక్రమంగా దోచుకుంటున్నారు అంటూ బనకచర్ల మీద రాజకీయ రచ్చ మొదలు పెట్టారు.

అయితే ఇందుకు కౌంటర్ గా ఏపీలో అధికారంలో ఉన్న కూటమి కూడా వైసీపీ ని ఈ రొచ్చులోకి లాగలేకపోతుంది. అటు తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ సైతం జగన్ కు కేసీఆర్ కి ఉన్న తెరచాటు బంధాల గురించి, వైసీపీ – బిఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న అనుబంధాల గురించి మాట్లాడలేకపోతున్నారు.

అటు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్ సీఎం గా ఉన్నప్పుడు కూడా తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలో ఉంది, కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నారు. కానీ బిఆర్ఎస్ టార్గెట్ ఎప్పుడు టీడీపీ నే ఎందుకు.? కేసీఆర్ ఆరోపణలు ఎల్లప్పుడూ బాబు పైనే వై.?

ఈ రెండు ప్రశ్నలను ఇటు టీడీపీ, అటు కాంగ్రెస్ నిత్యం చర్చలో ఉంచగలిగితే అప్పుడు వైసీపీ అసలు రంగు బయటకొస్తుంది, బిఆర్ఎస్ – వైసీపీ ల రాజకీయ బంధాలు, వారి హయాంలో అటు ఏపీలో ఇటు తెలంగాణలో జరిగిన అసలైన అభివృద్ధి, అవినీతి బట్టబయలవుతాయి.

కాళేశ్వరం నుంచి పాలమూరు ప్రాజెక్ట్ వరకు మేడిగడ్డ నుంచి కల్వకుర్తి వరకు బిఆర్ఎస్ ఎంతలా ప్రభుత్వం నుంచి చిక్కులను ఎదుర్కొంటున్నప్పటికీ బిఆర్ఎస్, వైసీపీ పేరును కనీసం చర్చలోకి తీసుకురావడానికి సుముఖంగా లేదు.

కృష్ణ నదీజలాల విషయంలో కేసీఆర్ ‘నాడు’ పెట్టిన సంతకాలు నేడు తెలంగాణకు శాపాలుగా మారాయి అంటూ రేవంత్ పదేపదే బిఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్న ఆ ‘నాడు’లో వైసీపీ ఎందుకు లేకుండా పోతుంది అనేది ఎవ్వరు ఎందుకు ఆలోచించడం లేదు.

నిజంగా ఆ నాడులో…వైసీపీ లేకుంటే అది ఏపీలో కూటమికి రాజకీయ అడ్వాంటేజ్ గా మారుతుంది. గత వైసీపీ లో రాష్ట్ర నీటి ప్రయోజనాల కోసం జగన్ చేసింది శూన్యమని, వైసీపీ కి రాష్ట్ర ప్రయోజనాలు, ఇక్కడి రైతుల అవసరాలు పట్టవా అంటూ వైసీపీ టార్గెట్ గా కూటమి జగన్ అండ్ కో ని ఇరుకునపెట్టొచ్చు.

లేదు ఆ నాడులో…జగన్ కూడా ఉంటే నాడు నోరు మెదపని కేసీఆర్ ఇప్పుడు ఎందుకు గళం విప్పుతున్నారు అంటూ ఎదురుదాడి చెయ్యొచ్చు, నాడు వైసీపీ తో చేతులు కలిపిన బిఆర్ఎస్ ఇప్పుడెందుకు కాలు దువ్వుతుంది అంటూ నిలదీయవచ్చు.

కానీ ఈ అంశాలేమి ప్రజలలో చర్చ జరగకూడదనే వ్యూహంలో భాగంగానే బిఆర్ఎస్ టీడీపీ ని ఇరుకునపెట్టేందుకు సిద్దమైయిందా.? అందుకే బాబు టార్గెట్ గా బిఆర్ఎస్ రాజకీయం మొదలుపెట్టిందా.? అలాగే ఆ ట్రాప్ లోకి తెలివిగా రేవంత్ సర్కార్ ని కూడా ఇరికించిందా.?

ADVERTISEMENT
Latest Stories