టాలీవుడ్ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల మీద కొండా సురేఖ చేసిన విమర్శలు అటు రాజకీయంగా ఇటు సినీ ఇండస్ట్రీ పరంగా పెద్ద దుమారాన్నే సృష్టించాయి. ఈ వివాదంలో ఎవరు వెనక్కి తగ్గారు, ఎవరు ముందడుగు వేశారు అని చర్చించుకునే ముందు అసలు తెలుగు ఇండస్ట్రీ వ్యక్తుల మీద రాజకీయ నాయకులు ఇటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయవలసిన అగత్యం ఎందుకు వచ్చిందా అని లోతుగా ఒక్కసారి పరిశీలిద్దాం.
గత పదేళ్లుగా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీనే రాజ్యమేలింది. అయితే ఆసమయంలో టాలీవుడ్ నుండి ఎందరో ప్రముఖ నటులు డ్రగ్స్ కేసు ఆరోపణలు ఎదుర్కొని విచారణకు సైతం హాజరయ్యి నిత్యం వార్తలలో నిలిచారు. అయితే ఆ కేసులో అసలు దోషులెవ్వరో ఇంతవరకు బయటపడనే లేదు.
అలాగే తమకు సంబంధం లేని వివాదంలో తమ పేరును చేర్చి తమ పరువును మీడియాలో పెడుతున్నారు అంటూ అప్పటి ప్రభుత్వం మీద ఎవరు దూషణలు చేసింది లేదు. అయితే అప్పటి ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని తన కనుసన్నల్లో ఉంచుకోవడానికే ఈ డ్రగ్స్ కేసును ఒక ఆయుధంగా వాడుకుంటుంది అంటూ ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూనే ఉంది.
కాంగ్రెస్ ఆరోపణలకు తగ్గట్టే బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా తనకు అవసరమైనప్పుడు డ్రగ్స్ వివాదం తెరమీదకు తెచ్చి సినీ పరిశ్రమలో వేడిని పుట్టించి అనుకోకుండా అదృశ్యమయ్యేది. ఆ వివాదమే నేటి కొండా సురేఖ వ్యాఖ్యలకు ఆజ్యం పోసి ఉండవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అంతేకాకుండా సినీ పరిశ్రమ లోని ప్రముఖుల జీవితాలు అద్దాల మేడలో కనిపించే గాజు బొమ్మలాంటిది. అందుకే వారు వారి వ్యక్తిగత జీవితాల గురించి అంత గోప్యత పాటిస్తుంటారు. అయితే గత ఐదేళ్లుగా ఒక పార్టీకి కొమ్ముకాయడానికి సినీ పరిశ్రమ నుంచే కొందరు నటులు, దర్శకులు సినీ ఇండస్ట్రీ వారి జీవితాలను బజారున పెట్టడానికి పునాదిరాళ్ళు వేశారు.
అందులో ముఖ్యంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ, నటుడు పోసాని కృష్ణ మురళి గత ఐదేళ్లుగా వీరు వైసీపీ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ జగన్ మీద తమ స్వామి భక్తి చూపిస్తూ మెగా ఫామిలీ మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద చేసిన నిందారోపణలు సురేఖ చేసిన వ్యాఖ్యలకంటే చాల నీచమైనవి, హీనమైనవిగా భావించాలి.
అయితే నాడు పోసాని పవన్ భార్యల మీద, అతని కూతుర్ల మీద చేసిన వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఆనాడే ఖండించి ఉంటే నేడు రాజకీయ నాయకులు ఇంతటి సాహసం చేసి ఉండేవారు కాదు అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది.
అలాగే తమిళ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో కూడా వైసీపీ నేతలు చేసిన నీచ రాజకీయ విమర్శలను ఇండస్ట్రీ పెద్దలు ఖండించి ఉంటే నేడు నాగార్జున కుటుంబానికి ఇంతటి అవమానం ఎదురయ్యి ఉండేది కాకపోవచ్చు అనే వాదన బలపడుతుంది.
అలాగే ఇండస్ట్రీ ఎదుర్కుంటున్న టికెట్ల ధరల సమస్య పరిష్కారానికి ఏపీకి తరలివచ్చిన సినీ దిగ్గజాలను అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి అవమానించి పంపించినప్పుడే ఇండస్ట్రీ తమకు జరిగిన అవమానం మీద గొంతెత్తి నిలదీసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటున్నారు సినీ అభిమానులు.
సమస్య వైరస్ లా అంతా వ్యాపించిన తరువాత మందురాశే బదులు సమస్య ఉత్పన్నం కాగానే దానికి సరైన వాక్సిన్ వేసి ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొనకపోయి ఉండేది.
తెలుగు వాడి ఆత్మగౌరవం అని సగర్వంగా చెప్పుకునే ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరి విషయంలో వైసీపీ నాయకులు హద్దులు దాటి విమర్శలు చేసినప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి కనీస స్పందన కూడా కరువయ్యింది. ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాడు కాదా.?
ఆయన కుటుంబానికి అవమానం జరిగితే అది ఇండస్ట్రీకి పట్టదా.? రాజకీయాలకు అతీతంగా ఒక మహిళ పట్ల ఇటువంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తే దాన్ని ఖండించడానికి మానవత్వం సరిపోదా.? అంతకు మించి వేరేదైనా కావాలా.?
చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళ పాటు ఉమ్మడి ఆంధ్రపద్రేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రాజకీయ నాయకుడు. తన 2020 విజన్ తో ఆనాడే హైద్రాబాద్ రూపురేఖలు మార్చిన విజనరీ నాయకుడు. తన హయాంలో సినీ ఇండస్ట్రీ అభ్యున్నతికి తనవంతు సహకారం అందించిన నేత.
ఇటువంటి నాయకుడు తనకు, తన కుటుంబానికి నిండు అసెంబ్లీ సభ వేదికగా అవమానం జరిగింది, దానికి కారణం వైసీపీ ప్రభుత్వం అంటూ కన్నీరుమున్నీరుగా విలపించినా సినీ ఇండస్ట్రీ మనసు కరగలేదు.
ఆయనకు మద్దతుగా, భువనేశ్వరికి క్షమాపణలు చెప్పాలి అంటూ వైసీపీ నేతలను ప్రశ్నించే సాహసం ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు చేయకపోవడమే ఇప్పుడీ దుస్థితికి కారణంగా మారింది. కనీసం ఇప్పటికైనా తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు అందరు ఒక్కతాటి పైకి రావడం అభినందించదగ్గ పరిణామమే.
అయితే ఈ స్పందన రాజకీయ పార్టీల జెండాలను బట్టి మారకుండా తప్పును తప్పుగా నిలదీయగలిగితే అది ఇండస్ట్రీకే కాదు సమాజానికి కూడా మేలు చేసినవారవుతారు.




