తెలంగాణలో కాంగ్రెస్-బిఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయాలు, విమర్శలు ప్రతి విమర్శలు పక్కన బెడితే, ఓ ప్రతిపక్ష నాయకుడు నిర్మాణాత్మకంగా ఏవిదంగా వ్యవహరించవచ్చో కేటీఆర్ ఆచరణలో చేసి చూపారు.
రెండు రోజుల క్రితం ఆయన సొంత నియోజకవర్గం సిరిసిల్లా పట్టణంలో విద్యుత్ చార్జీల పెంపుపై బహిరంగ విచారణ జరిగింది. 2024-25 సంవత్సరాలకి గాను మొత్తం రూ.1200 కోట్లు పెంచాలని డిస్కంలు ప్రతిపాదించగా దానిపై విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రజల తరపున, తమ పార్టీ తరపున తన వాదనలు వినిపించారు.
“ప్రభుత్వం విద్యుత్ పంపిణీ అనేది ఓ సామాజిక బాధ్యతగా భావించాలే తప్ప డిస్కంలు రాష్ట్ర ఖజానాకి నిధులు సమకూర్చే యంత్రాంగం కాదని గ్రహించాలి. మేము కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్ళు అందించాము. కానీ ఆ విద్యుత్ భారాన్ని రైతులపై, ప్రజలపై మోపలేదు.
కనుక ఈ విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనతో ప్రజలపై ఇంత భారం వేయడం సరికాదు. ముఖ్యంగా పెద్ద, చిన్న పరిశ్రమలను ఒకే కేటగిరీలోకి తీసుకురావాలనే ప్రతిపాదన వలన చిన్న పరిశ్రమలపై అధిక భారం పడితే నష్టపోతాయి. కనుక చిన్న పరిశ్రమలకు యధాతధంగా విద్యుత్ రాయితీలు కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము,” అని కేటీఆర్ వాదించారు.
ఆయన వాదనలు, హెచ్చరికల వలననో మరో కారణం చేత్తో విద్యుత్ నియంత్రణ మండలి రూ.1200 కోట్లు మేర విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనని తిరస్కరించింది. దానిలో రూ.1,170 కోట్ల భారం ప్రభుత్వం భరిస్తుందని, కొత్తగా కొన్ని కేటగిరీలలో పరిమితమైన పెంపుతో మిగిలిన రూ.30 కోట్లు వసూలు చేసుకోవాలని సూచించామని విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ శ్రీరంగారావు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ నియంత్రణ మండలి రెండూ విద్యుత్ పెంపు ప్రతిపాదనని వెనక్కు తీసుకోవడాన్ని కేటీఆర్ హర్షిస్తూ, తాము ఈ సమస్యపై బహిరంగ విచారణలో గట్టిగా తమ వాదనలు వినిపించినందునే వెనక్కి తగ్గాయని కనుక ఇది బిఆర్ఎస్ పార్టీ విజయంగా అభివర్ణించుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు విషయంలో మరేదో ఆలోచించి వెనక్కి తగ్గి ఉండవచ్చు. కానీ ప్రజలపై భారం పడుతుందని తెలిసినప్పుడు, కేటీఆర్ స్వయంగా బహిరంగ విచారణలో పాల్గొని తన వాదనలు వినిపించి ప్రతిపక్ష పార్టీగా నేతగా తన బాధ్యత నిర్వర్తించారని చెప్పవచ్చు.
ఏపీలో కూడా నవంబర్ నుంచి సర్దుబాటు ఛార్జీల వడ్డన మొదలవుతుంది. దాంతో భారీగా విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి. కానీ జగన్ బెంగళూరు ప్యాలస్‌లో విశ్రాంతి తీసుకుంటూ, తమ పార్టీ చేత సోషల్ మీడియాలో విద్యుత్ చార్జీల పెంపుపై రాజకీయాలు చేయిస్తున్నారు.
తమ పార్టీకి శాసనసభలో ప్రతిపక్షహోదా, తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని పట్టుబడుతున్న జగన్ ఈవిదంగా మాట్లాడరు. ఎందువల్ల అంటే ఈ విద్యుత్ చార్జీల పెంపు కూడా తమ పార్టీకి రాజకీయ మైలేజ్ ఇచ్చే అంశంగానే భావిస్తున్నారు కనుక.




