కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడున్న సున్నితమైన తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో ఎవరు వేలు పెట్టినా వారికే నష్టం తప్పదని జగన్ తింటున్న ఎదురుదెబ్బలతో స్పష్టం అవుతోంది.
నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మద్య ఇదే అంశంపై వివాదం కొనసాగుతుండగానే కోలీవుడ్ నటుడు కార్తీ కూడా చిక్కుకున్నాడు. కానీ వెంటనే తెలివిగా బయటపడ్డాడు.
కార్తీ, అరవింద్ స్వామి నటించిన ‘సత్యం సుందరం’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మొన్న హైదరాబాద్‌లో జరిగింది. ఆ కార్యక్రమంలో యాంకర్ “లడ్డూ కావాలా నాయినా?” అంటూ కార్తీని సరదాగా అడిగింది.
కార్తీ కూడా సరదాగా “వద్దు వద్దు లడ్డూ ఇప్పుడు చాలా సెన్సిటివ్ మ్యాటర్” అని జవాబు చెప్పాడు.
కానీ కార్తీ జవాబు పవన్ కళ్యాణ్‌కి ఏమాత్రం నచ్చకపోవడంతో తిరుమల, లడ్డూ ప్రసాదం గురించి జోక్స్ వేసుకోవడం సరికాదని హెచ్చరించారు. అప్పుడు కార్తీ కూడా వెంటనే పవన్ కళ్యాణ్‌కి క్షమాపణ చెప్పడం, అప్పుడు పవన్ కళ్యాణ్ వెంటనే ఆయనను క్షమించేయడం జరిగింది.
అయితే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ హెచ్చరికతో టాలీవుడ్, కోలీవుడ్ రెండూ ఉలిక్కి పడ్డాయి. సినీ పరిశ్రమకే చెందిన పవన్ కళ్యాణ్, ఓ పక్క హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ, కోలీవుడ్‌కి చెందిన మరో నటుడికి వార్నింగ్ ఇవ్వడాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు.
వారిలో ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. కార్తీ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌పై స్పందిస్తూ, “చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్…” అని ట్వీట్ చేశారు. కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏవిదంగా స్పందిస్తారో?
కానీ ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ఎంతగా స్పందిస్తే అంతగా ఇటువంటి విమర్శలు ఎదుర్కోవలసిరావచ్చు. ఎక్కడ తగ్గాలో పవన్ కళ్యాణ్‌కి బాగా తెలుసు కనుక ఇక్కడితో వదిలేస్తారనే ఆశిద్దాం. అలాగే ప్రకాష్ రాజ్ కూడా!





