ఆపద మొక్కుల వాడు, అందరి సమస్యలు తీర్చే కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికే సరికొత్త సమస్య వచ్చి పడింది. స్వామి వారి హుండీలో ప్రభుత్వం రద్దు చేసిన పాత 500, 1000 నోట్లు ఏకంగా 4 కోట్ల వరకు వచ్చిపడ్డాయి. గత రెండు నెలల కాలంలోనే ఈ సొమ్ము హుండీలో చేరింది. ఈ పాత నోట్లను మార్చుకోవడానికి ఇప్పటికే సమయం మించిపోయింది.
ఇప్పుడు ఈ మొత్తం సొమ్మును ఏం చేయాలో అర్థం కాక ఆలయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ డబ్బునంతా ఏం చేయాలో సూచించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు లేఖలు రాశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి ఈ పాత నోట్లను హుండీలో వేశారన్న సంగతిని లేఖలో పేర్కొన్నామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. మరి కేంద్రం నుండి ఎలాంటి సమాచారం వస్తుందో అన్న విషయం అత్యంత ఆసక్తికరంగా మారింది.
రద్దు చేసిన పాత నోట్లు పది కన్నా ఎక్కువ ఉంటే 10 వేలు లేదా పాత నోట్లకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ వ్యక్తుల పరిస్థితిలో అయితే ఈ 4 కోట్లకు రెట్టింపు, అంటే 8 కోట్ల రూపాయలు జరిమానా విధించాల్సి ఉంటుంది. మరి ఇదే నిబంధనను ఏడుకొండలవాడికి కూడా వర్తింపచేస్తారా? అలా అయితే 8 కోట్ల ఫైన్ విధిస్తారా? లేక దేవాలయం విషయంలో 4 కోట్ల పాత నోట్లు తీసుకుని, కొత్త నోట్లు ఇస్తారా? అనే విషయం తేలాల్సి ఉంది.
అయితే, తాజాగా వచ్చిన సమాచారం మేరకు… ఆపద మొక్కుల వాడికి భక్తులు సమర్పించిన రద్దయిన నోట్లను తీసుకునేందుకు ఆర్బీఐ అంగీకరించలేదని టీటీడీ ఈఓ సాంబశివరావు తెలిపారు. భక్తులు ఇకపై రద్దయిన నోట్లను హుండీలో వేయవద్దని, అవి స్వామి వారికి ఎందుకూ ఉపకరించవని మీడియాతో ద్వారా భక్తులకు స్పష్టత ఇచ్చారు. నోట్ల రద్దు తరువాత ఇప్పటివరకూ 8.29 కోట్ల విలువైన పాత నోట్లు హుండీకి వచ్చాయని తెలిపారు. ఇందులో 4 కోట్లు గడువు తేదీ తర్వాత రావడంతో, ప్రస్తుతం అవి ఎందుకు వినియోగం కాకుండా అయిపోయాయి.



