అమ్మా వంకాయలు, బెండకాయల్… డ్రోన్లు, యుద్ధ విమానాలూ…

Donald Trump global arms deals and India trade angle

అమ్మా వంకాయలు, బెండకాయలు, దొండకాయలూ…. అంటూ రోజూ వీధిలో నుంచి కూరగాయలమ్మేవారి కేకలు వినిపిస్తూనే ఉంటాయి.

అలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కూడా డ్రోన్లు, యుద్ధ విమానాలూ, జన్యుమార్పిడి చేసిన వరి, మొక్కజొన్నలూ… అంటూ దేశాలు బట్టి తిరుగుతున్నారు. లేదా రైతుబజారు లాంటి వైట్‌హౌస్‌కి వచ్చిన కస్టమర్లకి డిస్కౌంట్ ధరల్లో అమ్ముకుంటున్నారు.

ADVERTISEMENT

వీధిలో కూరగాయలు అమ్మేవారు బేరం కుదిరితే అమ్ముకుంటారు లేదా మరో వీధికి పోయి అమ్ముకుంటారు. కానీ ట్రంప్‌ అలా కాదు!

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనో లేదా మరోసాకుతో దిగుమతులపై భారీగా సుంకాలు పెంచేసి, ఒక్కో దేశపు చెయ్యి మెలిపెట్టి మరీ అమ్ముకుంటారు.

లేదా ఒక దేశాన్ని మరో దేశానికి బూచిగా చూపిస్తూ ఆయుధాలు అమ్ముకుంటారు. లేదా రెండు దేశాలు యుద్ధం చేసుకుంటుంటే రాజీ కుదిర్చి ఒప్పుకున్నవారికి భారీ డిస్కౌంట్ ఇచ్చి అమ్ముకుంటారు. లేదా యుద్ధాలు చేసుకుంటున్న దేశాలకు నాటో దేశాల ద్వారా ఉదారంగా డిస్కౌంట్ ధరల్లో అందిస్తుంటారు.

“ట్రంప్‌ ఒత్తిళ్ళకు, బెదిరింపులకు లొంగేదేలే… భారత్‌ ప్రయోజనాలే మాకు ముఖ్యం” అని ప్రధాని మోడీ తెగేసి చెప్పినప్పుడు, భారత్‌ మీడియా, విదేశీ మీడియా ‘వాహ్వా మోడీజీ… ఎంత ధైర్యవంతులు… ట్రంప్‌నే ఎదిరించి నిలబడ్డారు,’ అంటూ గొప్పగా మెచ్చుకున్నాయి.

ఇప్పుడు అదే మీడియా ‘భారత్‌-అమెరికా వాణిజ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయనే’ వార్తని కూడా వేస్తున్నాయి. అవి చూసి అపార్ధం చేసుకోకూడదు.

ట్రంప్‌ ఒత్తిళ్ళకు ప్రధాని మోడీ కూడా దిగిరాక తప్పలేదనుకోకూడదు. భారత్‌ జనాల దృష్ట్యా ఇదీ అవసరమే… తప్పదని సర్ది చెప్పుకోవాల్సిందే!

కనుక మోడీ మంచి స్నేహితుడని ట్రంప్‌ ఎలాగూ సర్టిఫై చేశారు. కనుక ఆ స్నేహం కోసం సుంకాలు కాస్త తగ్గించి, రష్యా నుంచి చమురు కొనుగోలు మానేసి భారత్‌ ఇబ్బంది పడకుండా ఆయనే చమురు డిస్కౌంట్ ధరలో సరఫరా చేయోచ్చు. దాంతో పాటు భారీ డిస్కౌంటుతో డ్రోన్లు, యుద్ధ విమానాలూ ఉదారంగా అమ్మవచ్చు.

భారత్‌లో 150 కోట్ల జనాభాలో సగం మంది అర్ధాకలితో మాడుతున్నారు. కనుక వారి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని జన్యుమార్పిడి చేసిన వరి, గోధుమలు, మొక్కజొన్నలూ వగైరా కూడా సరఫరా చేసినా ఆశ్చర్యం లేదు.

సౌదీ అరేబియా రాజుగారు మొహమ్మద్ బిన్ సల్మాన్ తొలిసారిగా వైట్‌హౌస్‌లో అడుగుపెట్టారు. ఆయనకు రాచమర్యాదలు చేసి ఎఫ్‌-35 యుద్ద విమానాలు, న్యూక్లియర్ టెక్నాలజీ(శాంతియుత ప్రయోజనాల కోసం), ఏఐ టెక్నాలజీ, ఇంకా విలువైన ఖనిజాలు అమ్మకానికి సంతకాలు పెట్టించుకున్నారు.

మొన్న చైనా, పాకిస్తాన్‌, నిన్న సౌదీ, రేపు భారత్‌… ఏ దేశమైనా వైట్‌హౌస్‌ రాచమర్యాదలు స్వీకరించి సంతాకాలు పెట్టి ట్రంప్‌ ఉదారంగా ఇస్తున్న డ్రోన్లు, యుద్ధ విమానాలూ తీసుకోవాల్సిందే! ట్రంప్‌ ఉదారతని అపార్ధం చేసుకోకూడదు!

ADVERTISEMENT
Latest Stories