
నేడు ఉగాది పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పంచాంగ శ్రవణం ఆనవాయితీ. సామాన్య ప్రజలకు చెప్పే పంచాంగం ఒకలా ఉంటుంది. దానిలో కష్టనష్టాలతో పాటు సుఖ సంతోషాలు కూడా ఉంటాయి.
కానీ రాజకీయపార్టీలకు చెప్పే పంచాంగం వేరేలా ఉంటుంది. అధికార, ప్రతిపక్షాలు రెంటికీ కూడా అన్నీ చాలా అనుకూలంగానే ఉంటాయని చెపుతుంటారు. అది ఏవిదంగా సాధ్యమో వారికే తెలియాలి.
Also Read – హర్ష్ కుమార్‌కు వైసీపీ వైరస్ సోకిందా?
రాజకీయ పార్టీలు, నాయకులు మరింతగా రాణించాలనుకుంటారే తప్ప ఎవరూ తమ రాజకీయ జీవితం భ్రష్టు పట్టిపోవాలని కోరుకోరు. ఆ నమ్మకంతోనే వారు రాజకీయాలు చేస్తుంటారు. కనుక వారి నమ్మకానికి అనుగుణంగానే పంచాంగం కూడా ఉంటుంది.
‘ఈ ఏడాది ఫలానా నెల నుంచి మీకు మహర్ధశ మొదలవబోతోందని చెప్పి సంతోషపెడుతుంటారు. కనుక ఎవరి పంచాంగం వారిదే.
Also Read – మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్: హ్యాండ్సప్
కానీ రాజకీయ పార్టీల తీరుని, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను చూస్తున్న రాజకీయ విశ్లేషకుల చేత ధైర్యంగా రాజకీయ పంచాంగం చెప్పించుకుంటే వాస్తవాలు కళ్ళకు కట్టినట్లు చెప్పగలరు.
తెలంగాణలో రాజకీయ పార్టీలు:
Also Read – చంద్రబాబు నాయుడు @75: అదే పోరాటస్పూర్తి
తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలో రాజకీయాలను చూసినట్లయితే రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పడుతూ లేస్తూ ముందుకు సాగుతుండటం కనిపిస్తుంది.
ఇందుకు ఆర్ధిక సమస్యలు ప్రధాన కారణంకాగా, ఓ పక్క కేంద్ర ప్రభుత్వం, మరోపక్క కాంగ్రెస్ అధిష్టానం, ఇంకో పక్క తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత అసమ్మతి, ఆ కారణంగా ఒత్తిళ్ళు, మరోపక్క బిఆర్ఎస్ పార్టీ ఎదురుదాడులు వంటి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
ఎన్నికల వరకు ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి తప్ప కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడేందుకు దోహదపడే ఏ పరిణామాలు కనిపించడం లేదు. ఒకవేళ కేసీఆర్, కేటీఆర్‌లను ఏదైనా కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపితే సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గ్రాఫ్ పెరగవచ్చు లేదా తరగవచ్చు.
బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. పైగా కేసులు, అరెస్టుల కత్తి తలపై వ్రేలాడుతూనే ఉంది. సొంతంగా ఏమీ సాధించడం కష్టమే. కనుక కేంద్రంతో సఖ్యత కుదుర్చుకొనేందుకు ప్రయత్నాలు ఫలిస్తే, క్రమంగా తెలంగాణ రాజకీయాలలో చిన్న చిన్న మార్పులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.
కానీ తెలంగాణలో బీజేపి-బిఆర్ఎస్ పార్టీల మద్య సఖ్యత లేదు. కనుక అంతా రహస్యంగా లోపాయికారిగానే సాగించాల్సి ఉంటుంది.
తెలంగాణలో ఎప్పటికైనా అధికారంలోకి రావాలని బీజేపి తహత్యహలాడుతోంది కనుక మళ్ళీ కేసీఆర్ బలపడేందుకు సాయపడకపోవచ్చు. పైగా రేవంత్ రెడ్డికి పరోక్షంగా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం ఉంది. కనుక ఎన్నికల వరకు ఆయన ప్రభుత్వం జోలికి కేంద్రం వెళ్ళకపోవచ్చు.
ఆంధ్రప్రదేశ్:
కూటమి, వైసీపీల పరిస్థితి ఏవిదంగా ఉందో, ఉండబోతోందో తెలుసుకునేందుకు ఏ పంచాంగమూ చూడనవసరం లేదు.
కూటమిలో ఐక్యత ఉంది. కనుక అది చెడితే తప్ప తమ గ్రహస్థితి మారదని జగన్‌కు బాగా తెలుసు. అందుకే పదేపదే ప్రయత్నిస్తున్నారు. కనుక కూటమిలో చిచ్చు రగిలే వరకు వైసీపీ నేతలు, జగన్ ప్రయత్నిస్తూనే ఉంటారు. అంతవరకు ఓపికగా వైసీపీ నేతలు ఎదురు చూడాల్సిందే.
కానీ చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలని, ఆయన నాయకత్వంలో తాను పనిచేయాలని కోరుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. కనుక వైసీపీ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.
ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు. కనుక జగన్ కేసులను వేగవంతం చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. ఆ కేసులలో కదలికలు వస్తే వైసీపీ గ్రహస్థితి మరింత క్షీణిస్తుంది. ఒకవేళ ఏ కారణం చేత అయినా కేసులు ఇలాగే నత్త నడకలు సాగుతుంటే, వైసీపీకి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. ‘ఈసారి మనమే..’ అనే పాట పాడుకుంటూ జగన్ కాలక్షేపం చేసుకోవచ్చు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు బాగున్నాయి. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు వస్తూనే ఉంటాయి. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కళ్ళకు కనబడే స్థాయిలో అభివృద్ధి సాధించేలా చంద్రబాబు నాయుడు చేయగలిగితే, కూటమికి ఇక తిరుగు ఉండదు.
బీజేపి కోసం పవన్ కళ్యాణ్ తమిళనాడువైపు అడుగులు వేస్తే ఆయన పరపతి మరింత పెరుగుతుంది. కానీ కొత్త మిత్రులతో పాటు కొత్త శత్రువులు కూడా సృష్టించుకున్నట్లవుతుంది.
కనుక తమిళనాడు రాజకీయాలలో వేలుపెట్టడం కంటే ఈ 5 ఏళ్ళలో ఆంధ్రాలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం, మంత్రిగా తన సమర్దత నిరూపించుకోవడంపై పవన్ కళ్యాణ్ ఎక్కువ దృష్టి పెడితే మంచిది.
సిఎం చంద్రబాబు నాయుడు వయసు ప్రస్తుతం 74 సంవత్సరాలు. కనుక మరో 5 ఏళ్ళు, ఆ తర్వాత మరో 5 ఏళ్ళలో పెరిగే వయసు, ఆరోగ్య పరిస్థితి వగైరాలన్నీటినీ పరిగణనలోకి తీసుకొని తదనుగుణంగా పార్టీని సంసిద్దం చేసుకోవడం చాలా అవసరం.