ప్రముఖ అంతర్జాతీయ లోదుస్తుల తయారీ కంపెనీ ‘జాకీ’ ఇటీవల తెలంగాణలో రెండు ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం (ఎంఓయు) చేసుకొంది. వీటి ద్వారా 7,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించడమే కాక పన్నుల రూపంలో రాష్ట్రానికి భారీగా ఆదాయం కూడా సమకూరుతుంది. చాలా సంతోషం.
అయితే 2018లోనే ఈ కంపెనీని అనంతపురం జిల్లాలోని రాప్తాడులో నెలకొల్పేందుకు అప్పటి టిడిపి ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చి ఒప్పించి, అన్ని అనుమతులు ఇచ్చింది. వాస్తవానికి జాకీ కంపెనీని బెంగళూరులో నెలకొల్పేందుకు దాని యాజమాన్యం పేజ్ ఇండస్ట్రీస్ సిద్దమైనప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులు దానిని ఎంతో శ్రమపడి ఒప్పించి రప్పించారు. ఆ తర్వాత జాకీ కంపెనీ రాప్తాడులో నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టింది. అయితే సిఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంటే 2019లో అన్ని పనులు నిలిపివేసి, రెండేళ్ళ తర్వాత ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించేసి వెళ్లిపోయింది? దేనికి?
ఆ పరిశ్రమ వస్తే వెనుకబడిన అనంతపురంలో 7,000 మందికి ఉద్యోగాలు, అనేక మందికి ఊపాది లభించి ఉండేవి. జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు తీసుకురాకపోగా తాము శ్రమడి తెచ్చినవాటిని కూడా వేధించి పారిపోయేలా చేస్తోందని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పరిశ్రమలు పారిపోయేలా చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం వాటిని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయించుకొని లబ్ది పొందుతోందని, వేలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తోందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. వాటికి వైసీపీ నేతలు జవాబు చెప్పనేలేదు.
ఈ పాత రికార్డుని పరిశీలించినట్లయితే టిడిపి ప్రభుత్వం జాకీ పరిశ్రమను రప్పించడానికి ఎంత ప్రయత్నించిందో అర్దం అవుతోంది. అవుతుంది. ఆ కంపెనీ ఆరెంజ్ కేటగిరీ కింద 2018, అక్టోబర్ 3వ తేదీన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా అదే నెల 30వ తేదీన అనుమతి మంజూరు చేసింది. సెప్టెంబర్ 10వ తేదీన బిల్డింగ్ నిర్మాణ పనులకు దరఖాస్తు చేసుకోగా 2019 ఆగస్ట్ 8వ తేదీన అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 8 రకాల అనుమతులు అవసరం కాగా ఆరేడు నెలల వ్యవధిలోనే రెండింటికి మినహాయింపులు ఇచ్చి మిగిలిన 6 అనుమతులు మంజూరు చేసింది.
కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాకీ నిర్మాణ పనులకు బ్రేకులు వేసినట్లు నిలిచిపోయాయి…. ఆ తర్వాత దణ్ణం పెట్టేసి తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయింది. గత శుక్రవారం విజయవాడలో వాణిజ్య సలహా కమిటీ (ట్రేడ్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో పాల్గొన్న వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి ఆదాయం తక్కువగా ఉందని తమని వేధించడం సరికాదని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మొహం మీదనే చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలబడుతూ, కొత్త పరిశ్రమల స్థాపనకు సహకరించాల్సి ఉండగా జాకీ వంటి అంతర్జాతీయ కంపెనీ దణ్ణం పెట్టి పారిపోయేలా చేసింది. రాష్ట్రంలో ఇంకా ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయో… ఎన్ని తరలిపోతున్నాయో?జాకీ… ఓ చిన్న ఉదాహరణ మాత్రమే.



