ఇవాళ నిర్మాతల మండలి పండగలకు పబ్బాలకు కేవలం స్ట్రెయిట్ సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ఒక లేఖను విడుదల చేయడం బాగానే ఉంది. అందులో ప్రత్యేకంగా దిల్ రాజు వారసుడుని భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ప్లాన్ చేయడాన్ని నేరుగా ప్రస్తావించకపోయినా ఆయన పేరుని వాడుకుని గతంలో పేట టైంలో అన్న మాటలకు కట్టుబడమని, ఎలాగూ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కదానే లాజిక్ తో అందులో ఒక పాయింట్ పెట్టింది. వినడానికి బాగానే ఉంది ఉంది ఇది చదవగానే రాజు గారు మనసు మార్చుకుని వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు దారి వదులుతారా. తన వారసుడుని ఇన్నేసి పరిమిత స్క్రీన్లలోనే రిలీజ్ చేస్తానని బాహాటంగా చెబుతారా. ఇదే ఇప్పటి కోటి డాలర్ల ప్రశ్న
అభిమానుల్లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనే మెదులుతున్న సందేహమిది . ఇక్కడ కొన్ని విషయాలు లోతుగా విశ్లేషించుకోవాలి. ఎంత వినోదం కోసమే అయినా సినిమా అనేది వ్యాపారం. కోట్లలో పెట్టుబడులు జరిగేది లాభాల కోసం తప్ప ఏదో సంఘసేవకు కాదు. దిల్ రాజు ఒకవేళ నా థియేటర్లు నా ఇష్టమన్నా, లేదూ బయ్యర్లను నేనేం బలవంతపెట్టలేదని, కావాలంటే వాళ్ళకే ఏ సినిమా కావాలో దాన్నే కొనుక్కోమని చెప్పినా ఎవరూ కాదనలేరు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థనే పెద్ద సాలెగూడు లాంటిది. బయటికి వాళ్లకు అంత సులభంగా అర్థం కాదు. నలుగురి చేతిలో పంపిణి వ్యవస్థ నలిగిపోతోందని చిన్న నిర్మాతలు ఎన్నోసార్లు మొత్తుకున్నా ఏ కదలిక లేని సిస్టం జరుగుతోంది.
కాసేపు ఈ విషయాన్ని పక్కనపెట్టి అసలు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నిర్మాతల మండలి లేదా డిస్ట్రిబ్యూటర్ల సంఘాలు ఎంత మేరకు సంఘటితంగా పరిష్కారం కోసం పోరాడాయంటే సమాధానం దొరకదు. 2017 సంక్రాంతికి పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి తీసిన హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమాకు థియేటర్లు దొరకలేదు. ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణిల పాటు దిల్ రాజే తీసిన శతమానం భవతి రేస్ లో ఉండటంతో ఎవరూ ఆయన మాట వినలేదు. నాకు హక్కులు లేవాని అంత సీనియర్ మోస్ట్ దర్శక నిర్మాత మొత్తుకున్నా లాభం లేకపోయింది. చివరికి రామోజీరావు మయూరి ఫిలిమ్స్ రంగంలోకి దిగి వీలైనన్ని ఇప్పించి రిలీజ్ కు మార్గం కల్పించింది.
చిన్నా పెద్దా సంబంధం లేకుండా ఇలాంటి చిక్కులు ప్రతిసారి వస్తూనే ఉన్నాయి. వివాదాలు మీడియాలో తిరిగినంత వేగంగా వాటి సొల్యూషన్లు కౌన్సిల్ నుంచి రావడం లేదు. ఇప్పుడు దిల్ రాజుకి అందరూ రివర్స్ అవుతారని లేదు. ఎందుకంటే ఆయన చేతిలో ప్యాన్ ఇండియా మూవీ రామ్ చరణ్ 15 ఉంది. డిస్ట్రిబ్యూటర్లు దాన్ని దృష్టిలో పెట్టుకునే వారసుడుకి సహకరిస్తున్నారన్న కామెంట్స్ ట్రేడ్ వర్గాల్లో ఉన్నాయి. అందరికీ పెద్దమనిషిగా తల్లో నాలుకగా ఉండే రాజుకి ఇప్పుడిది పెద్ద తలనొప్పే. విజయ్ సినిమాకు థియేటర్ అగ్రిమెంట్లు చేస్తున్న సమాచారం బయటికి రావడమే ఈ రచ్చకు కారణం. సుప్రసిద్ధ సుదర్శన్ 35 ఎంఎంని దానికి లాక్ చేస్తే ఫ్యాన్స్ కి కాలదా మరి
ఇప్పుడు దిల్ రాజు ఎలాంటి సమాధానం ఇస్తారనేది అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తనది డబ్బింగ్ మూవీ కాదని దబాయించలేరు. తెలుగు దర్శకుడు నిర్మాత తీసినంత మాత్రాన అనువాదం కాకుండా పోదు. అంతెందుకు రంజితమే పాటను తమిళంలో వదిలారు కానీ ఇప్పటిదాకా తెలుగు పాట ఊసు లేదు. ఇక్కడే అర్థమవుతోంది కదా వారసుడు ప్రాధాన్యం దేనికో ఎటువైపో. అలాంటప్పుడు దీన్ని సాగదీయకుండా తమిళ వెర్షన్ నుంచి వచ్చే లాభాలను దృష్టిలో ఉంచుకుని వీరయ్య, వీరసింహాలకు దారి వదలడం మంచిదే. అలా అయితే కథ సాఫీగా కంచికి చేరినట్టే. కానీ చరిత్ర మాత్రం ట్రైన్ మధ్యలోనే ఆగిపోయిన ఉదాహరణలే చూపిస్తోంది



