ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కేరళలో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. మొత్తం 140 సీట్లకి 102 సీట్లు గెలుచుకొని తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థితిలో ఉంది.
కానీ అప్పటి నుంచి కేరళం సిఎం పదవి ఎంపిక విషయంలో కాంగ్రెస్ మార్క్ డ్రామాలు సాగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు నేడు ఎర్నాకుళం జిల్లా, పరవూర్ నియోజకవర్గం నుంచి వరుసగా 6వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వీడీ సతీశన్ పేరు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.
ఈ పదవి కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మరో సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల చాలా తీవ్రంగా ప్రయత్నించారు. కానీ కేరళంలో ఓ బలమైన సామాజిక వర్గంతో పాటు ముస్లిం ఓటర్లపై మంచి పట్టున్న వీడీ సతీశన్‌ని సిఎం పదవికి ఎంపిక చేసింది. కనుక నేడో రేపో వీడీ సతీశన్ కేరళం సిఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
కేరళంతో పోలిస్తే తమిళనాడులో అతిపెద్ద్ పార్టీగా అవతరించిన టీవీకే పార్టీకి 108 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున మరో 12 మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకొని మ్యాజిక్ ఫిగర్ 118 చేరుకోవడానికి ఆ పార్టీ అధినేత జోసఫ్ విజయ్ 5 రోజులు నానా అవస్థలు పడ్డారు.
ఎమ్మెల్యేల సంతకాలు చేసిన పత్రాలతో గవర్నర్ చుట్టూ తిరుగుతూ ప్రభుత్వం ఏర్పాటుకి అనుమతించమని పదేపదే విజ్ఞప్తి చేశారు. అతికష్టం మీద ఎమ్మెల్యేలను సమకూర్చుకొని చివరికి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగారు. శాసనసభలో బలనిరూపణ కూడా చేసుకొని పాలన మొదలుపెట్టేశారు.
కానీ కేరళంలో యూడీఎఫ్ పూర్తి మెజార్టీతో గెలిచినప్పటికీ పది రోజుల పాటు ముఖ్యమంత్రిని ఖరారు చేయలేకపోయింది.
చివరికి నేడు వీడీ సతీశన్‌ని సిఎంగా ఎంపిక చేసినప్పటికీ, జీవితంలో చివరి అవకాశంగా ఈ పదవి కోసం పోటీ పడిన కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల గ్రూపులు కట్టి సిఎం కుర్చీ కింద మంట పెట్టకుండా ఉంటారా? ఇక నుంచి వీడీ సతీశన్ కూడా నెలకు రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి రాక తప్పదు.




