వెలిగొండ ఆలోచన కార్యరూపం దాల్చేందుకు పదేళ్ళు పడితే, దానిని పూర్తి చేయడానికి మరో 30 ఏళ్ళు పట్టింది. నాడు సమైక్య రాష్ట్రంలో సిఎం చంద్రబాబు నాయుడు 1996, మార్చి 5న దీనికి శంకుస్థాపన చేశారు. ముప్పై ఏళ్ళ తర్వాత అంటే రేపు (ఆగస్ట్ 31)న ప్రారంభోత్సవం చేయబోతున్నారు.
కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో సాగు, తాగు నీటికి ఇబ్బంది ఉండేదని నలబై ఏళ్ళ క్రితమే పాలకులు గుర్తించినా, భూసేకరణ, న్యాయ, ఆర్ధిక సమస్యలు, ప్రభుత్వాలు, వాటితో పాటు వాటి ఆలోచనలు, ప్రాధాన్యతలు మారుతుండటం, రాజకీయాలు వంటి అనేకానేక కారణాల వలన ఈ ప్రాజెక్టు నత్తనడకలు నడిచింది. ఈ కారణంగా ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వాలు ఖర్చు చేసిన వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.
కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిని, దీని సమాన వయసున్న పోలవరాన్ని పూర్తిచేయాలని కంకణం కట్టుకొని పనులు జరిపించింది. కనుకనే రేపు వెలిగొండ నుంచి 43.50 టీఎంసిల సామర్ధ్యం కలిగిన నల్లమల్ల సాగర్‌కు నీళ్ళు విడుదల కాబోతున్నాయి.
శ్రీశైలం జలాశయం వద్ద కొల్లంవాగులోని కృష్ణానది బ్యాక్ వాటర్స్ నుంచి నల్లమల్ల సాగర్‌కు నీటిని తరలించి, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సాగు, త్రాగు నీటిని అందిస్తారు.
ఈ ప్రాజెక్టు ద్వారా మూడు జిల్లాల్లోని సుమారు 4.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నిరంతర సాగునీరు అందుతుంది. కనుక దశాబ్దాలుగా తీవ్ర వర్షభావంతో నష్టపోతున్న ఈ మెట్ట ప్రాంత రైతులు ఈ ప్రాజెక్టుతో నీటి సమస్యల నుంచి శాశ్వితంగా విముక్తి పొందుతారు. తద్వారా ఈ మూడు జిల్లాలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు పుంజుకుంటాయి. రైతుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
అలాగే పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో దశాబ్దాలుగా ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలు నానా బాధలు పడుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 30 మండలాల్లోని సుమారు 1,657 గ్రామాలకు వాటిలో సుమారు 15.20 లక్షల మంది ప్రజలకు స్వచ్ఛమైన, ఫ్లోరైడ్ రహిత తాగునీరు అందుతుంది.
ఈ మూడు ప్రాంతాలలో నీటి కరువు వలన లక్షలాది మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోయారు. దీంతో మూడు జిల్లాలలో సామాజిక పరిస్థితి దయనీయంగా మారింది. కనుక ఈ ప్రాజెక్టుతో నీటిని అందించి సశ్యశ్యామలం చేయడం ద్వారా వలసలు ఆగుతాయి. వలసలు వెళ్ళినవారు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఏర్పడుతాయి.
నీటి కరువుకి మరో కారణం భూగర్భ జలాలు లేకపోవడం. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నల్లమల కొండలలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్లను కలుపుతూ నిర్మించిన నల్లమల సాగర్‌లో43.50 టీఎంసిల నీటిని నిల్వ చేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జల మట్టం గణనీయంగా పెరుగుతాయి. ఒక్క వెలిగొండ ప్రాజెక్టు వల్లనే ఒకేసారి మూడు జిల్లాలలో ఇన్ని సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది చాలా కీలకమని స్పష్టమవుతోంది.





