విశాఖ ప్రజలు తమ నగరం రాజధాని కావాలనుకొంటున్నారో లేదో తెలీదు కానీ వేరే జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ విశాఖ రాజధాని కావాలని ఒకటే హడావుడి చేస్తున్నారు. రేపు జేయేసీ పేరుతో నగరంలో ర్యాలీలు, సభలు నిర్వహించి గర్జించబోతున్నారు. విశాఖ రాజధానిగా వద్దని ఎవరైనా అంటే వారిని జిల్లా పొలిమేరల వరకు తరిమికొట్టాలని ఓ మంత్రి ప్రజలను రెచ్చగొట్టడం విస్మయం కలిగిస్తుంది. అంటే ప్రజల అభిప్రాయాలు వైసీపీ అభిప్రాయానికి భిన్నంగా ఉండకూడదు. వైసీపీ ఏమి కోరుకొంటోందో ప్రజలందరూ కూడా దానినే కోరుకొన్నట్లు వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లే ఉంది. అయితే వైసీపీ నేతల విశాఖ రాజధాని డిమాండ్ వెనుక భూకుంభకోణాలతో పాటు రాజకీయ కోణం కూడా ఉంది. ఈ అంశంతో టిడిపిని ఉత్తరాంద్రలో ముఖ్యంగా విశాఖ జిల్లాలో రాజకీయంగా దెబ్బతీయాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. దీనికి తాజా నిదర్శనమే ఆ పార్టీలో, ప్రభుత్వంలో, విశాఖ రాజకీయాలలో చక్రం తిప్పుతున్న విజయసాయి రెడ్డి తాజా ట్విట్టర్ మెసేజ్.
దానిలో ఆయన “విశాఖ రాజధానిగా వద్దని చెపుతున్న టిడిపి నేతలందరినీ ఎందుకు వద్దని చెపుతున్నారని ఉత్తరాంద్ర ప్రజలందరూ గట్టిగా నిలదీయాలి. ఈ 32 నియోజకవర్గాలలో ఓటర్లు ఎవరూ కూడా యాంటీ-ఉత్తరాంద్ర అంటున్న టిడిపికి ఓట్లు వేయకూడదు,” అని దాని సారాంశం. ఈ చిన్న సందేశం విశాఖ రాజధానిగా చేయాలనే వైసీపీ డిమాండ్ వెనుక రాజకీయ ఉద్దేశ్యాన్ని బట్టబయలు చేస్తోంది.
టిడిపిని, చంద్రబాబు నాయుడుని దెబ్బ తీయడానికి వేలకోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న అమరావతిని వైసీపీ ప్రభుత్వం పక్కన పడేసి రాష్ట్రానికి తీరని నష్టం కలిగించింది. ఇప్పుడు వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ రాజధాని పేరుతో ప్రాంతాల మద్య చిచ్చు పెడుతూ ఉత్తరాంద్ర ప్రజలను టిడిపికి, రాజధాని రైతులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు వెనకాడటం లేదు.
I urge the people of Uttarandhra to question the leaders of @JaiTDP as to why they oppose Vizag from becoming the Capital of Andhra Pradesh? None of the voters of the 34 constituencies should vote for TDP with anti-Uttarandhra sentiments.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 14, 2022
—



