అన్ని పార్టీలు నైతిక విలువలు, ప్రజాస్వామ్యం అంటూ ఎన్ని సుద్దులు చెప్పినా అన్నిటి లక్ష్యం ఒక్కటే.. ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడమే!
తమిళనాడులో విజయ్ దళపతి కూడా అలాంటి మాటలు చెప్తూనే టీవీకే పార్టీతో బరిలో దిగి 108 సీట్లు గెలుచుకున్నారు. కనుక ఇప్పుడు ఆ నీతి సూక్తులన్నీ పక్కన పెట్టి డీఎంకేతో కలుసున్న కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకి సిద్దం అవుతున్నారు.
“ఇది అన్యాయం, అక్రమం, అనైతికం” అని డీఎంకే వాదిస్తోంది. ఓడిపోయినవాడి ఆక్రందనలు ఎవరూ వినరు. అధికారంలో ఉన్నవాడి మాటే వేదవాక్కు.. అదే సర్వత్రా చెల్లుబాటు అవుతుంది. కనుక విజయ్ సిఎం పదవి చేపడితే ఆయన చేసిందే న్యాయం, ధర్మం అవుతుంది.
కానీ చిన్నా చితకా పార్టీలను కూడగట్టుకొని 12 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినా అది ఎక్కువ కాలం నిలబడుతుందా? అంటే ఒక్కరు తప్పుకున్నా కూలిపోవడం ఖాయం.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలాగే కూలిపోతుందని కేసీఆర్ ఆశపడ్డారు. కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకే ఎసరు పెట్టి 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి దిగుమతి చేసుకున్నారు. కనుక విజయ్ కూడా నీతి, నిజాయితీ, నైతిక విలువల కబుర్లు పక్కన పెట్టి రెండు పార్టీలలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రభుత్వాన్ని బలపరుచుకోక తప్పదు.
కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలా విజయ్ ప్రభుత్వం కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా న్యాయ పోరాటాలు చేయక తప్పదు. అదేమీ పెద్ద సమస్య కానే కాదు.
కానీ ఆయనతో మొదటి నుంచి పొత్తు కోసం తపిస్తున్న బిజేపి చేతులు ముడుచుకొని కూర్చుంటుందా? అంటే కూర్చోదని ఆమాద్మీ కేజ్రీవాల్ చెప్తున్నారు. ఇప్పుడు మమతక్క కూడా చెప్తున్నారు.
కనుక కనీసం 5 ఏళ్ళు ప్రశాంతంగా ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే అన్నాడీఎంకే-బిజేపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం ‘సేఫ్ గేమ్’ అనుకోవచ్చు. తద్వారా కనీసం 5 ఏళ్ళు అధికారానికి గ్యారెంటీ ఉంటుంది. ఈ 5 ఏళ్ళలో తమిళనాడులో టీవీకే పార్టీని తిరుగులేని శక్తిగా మార్చుకోవచ్చు. రాష్ట్రానికి నిధులు, పరిశ్రమలు, అభివృద్ధి పనులు సాధించుకోవచ్చు. కనుక నీతి నిజాయితీ, బేషజాలు అన్నీ పక్కన పెట్టగలిగితే ఇది తెలివైన నిర్ణయం అవుతుంది.
పవన్ కళ్యాణ్ కూడా ఈవిధంగా ‘సేఫ్ గేమ్’తో ఏపీ రాజకీయాలలో ఎలా… ఎంతగా రాణించారో అందరూ చూస్తూనే ఉన్నాం కదా?
కానీ విజయ్ రిస్క్ తీసుకోబోతున్నారు. కనుక ఇక ప్రతీరోజూ మిగిలిన పార్టీలతో పొలిటికల్ గేమ్స్ ఆడక తప్పదు.




