కనీవినీ ఎరుగని కార్యక్రమాలను ప్రవేశపెట్టడం వైసీపీ ప్రభుత్వం వంతవుతోందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ప్రభాస్ నటించిన “రాధే శ్యామ్” సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కానుంది అనంగా, విజయవాడ మేయర్ ఓ కీలక ఉత్తర్వులు జారీ చేసి ధియేటర్ల యాజమాన్యానికి షాక్ ఇచ్చారు. బహుశా ఈ షాక్ నుండి తేరుకోవడానికి యాజమాన్యాలకు కొద్ది సమయం పడుతుందేమో!
ఇంతకీ ఈ ఉత్తర్వులలో ఆంతర్యం ఏమిటంటే… పార్టీ ప్రతినిధులు మరియు వార్డ్ కార్పొరేటర్లు టికెట్లు కావాలని అడుగుతున్న నేపధ్యంలో విజయవాడ మునిసిపల్ పరిధిలో సినిమాలు ప్రదర్శిస్తోన్న మాల్స్ లో ప్రతి షోకు 100 టికెట్లు విజయవాడ మునిసిపల్ కార్యాలయానికి పంపించాలని, దానికి తగిన ఛార్జీలు నగదు రూపంలో చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఇది రేపు రిలీజ్ కాబోయే “రాధే శ్యామ్” సినిమాకు ఇచ్చిన బంపర్ ఆఫర్ కాదు, ఈ వరుస క్రమంలో విడుదల కాబోయే ప్రతి కొత్త చిత్రాలకు ఇదే సూత్రం వర్తిస్తుందని తెలిపారు. ఈ ఉత్తర్వులు చదివిన ధియేటర్ యాజమాన్యం ఖచ్చితంగా నోరెళ్ళపెట్టాల్సిందే. సినీ పరిశ్రమను ఇప్పటికే అనేక ఇక్కట్లు పాలు చేసిన వైసీపీ సర్కార్ సరికొత్త ఎత్తుగడగా దీనిని పేర్కొనవచ్చు.
అయినా మేయర్ అనే వ్యక్తి ప్రభుత్వ అధికారి, ప్రజాసేవకుడు. ఆ అధికారంలో ఉన్న వ్యక్తి ప్రజలకు సంబంధించిన విషయాలను వదిలేసి ఒక రాజకీయ పార్టీ ప్రతినిధుల కోసం, వార్డ్ కార్పొరేటర్ల కోసం ఇలా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం ఏమిటన్న కోణంలో విమర్శలు వెలువడుతున్నాయి. చేతిలో ఉన్న అధికారాన్ని ఇలా వినియోగించుకుంటారా? అని వాపోవడం ప్రజల వంతవుతోంది.
ఇదిలా ఉంటే జగన్ సర్కార్ ఇచ్చిన కొత్త జీవోకు గానూ సినీ పరిశ్రమ సన్మానం చేయడానికి సన్నాహాలు చేస్తోందన్న టాక్ బలంగా వినపడుతోంది. సినీ ఇండస్ట్రీ చేయబోయే సన్మానం కంటే, షోకు 100 టికెట్ల “సన్మానం” మరింత కాస్ట్లీ మారుతుందేమో! ప్రతి దానికి ఏదొక కొత్త కారణాన్ని చెప్పడం వైసీపీ సర్కార్ కు పరిపాటే గనుక, ఈ మేయర్ ఇచ్చిన ఉత్తర్వులకు ఎలాంటి కారణాన్ని చెప్తారో!?
బహుశా పేద వాళ్ళైనా పార్టీ ప్రతినిధులు మరియు వార్డ్ కార్పొరేటర్ల కోసం విజయవాడ మేయర్ తీసుకున్న ఓ మంచి నిర్ణయంగా దీనిని కొనియాడుతారేమో! ఈ ఉత్తర్వులలో ట్విస్ట్ గుర్తుందిగా… ఈ 100 టికెట్ల మొత్తానికి అయ్యే ఛార్జీలను నగదు రూపంలో చెల్లిస్తామని చెప్పారండోయ్!




